16-11-2025 12:00:00 AM
తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటుడు కాంతారావు. 1923, నవంబర్ 16న సూర్యాపేట జిల్లా గుడిబండలో పుట్టిన ఆయన పలు సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో నటించారు. 400పైగా సినిమాల్లో నటించిన ఈయన తొలిచిత్రం ‘నిర్దోషి’. ఎన్టీరామారావు, ఏఎన్నార్ సమకాలికుడైన కాంతారావు వారితో సమానమైన గుర్తింపు పొందిన సందర్భాలెన్నో! దాసరి నారాయణరావు మాటల్లో చెప్పాలంటే, ‘తెలుగు చిత్రసీమకు రామారావు, నాగేశ్వరరావు రెండు కళ్లయితే, వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు’.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయిశ్రీనివాస్ తమన్ శివకుమార్. రవితేజ ‘కిక్’ మూవీకి తొలిసారి సంగీతం అందించారు. దర్శకుడు శంకర్ ‘బాయ్స్’లో చిన్న పాత్రలో నటించారు. సంగీతం వైపు మారి, ప్రముఖ స్వరకర్తగా పేరు తెచ్చుకున్నారు. దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడే ఈ తమన్. తండ్రి ఓ డ్రమ్మర్. తల్లి సావిత్రి నేపథ్య గాయని. వీళ్లది నెల్లూరు జిల్లా పొట్టేపాళెం. 1983, నవంబర్ 16న జన్మించిన తమన్ ఆదివారం 42వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
ఆమని.. 1973, నవంబర్ 16న పుట్టి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివారం తో ఆమె 51వ పడిలోకి అడుగిడుతున్నారు. ఈవీవీ సత్యనారాయణ ‘జంబలకిడిపంబ’ సినిమా లో నరేశ్ సరసన తొలిసారి హీరోయిన్‌గా నటించారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘మిస్టర్ పెళ్లాం’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. అందులో నటించిన ఆమని కూడా ఉత్తమ నటిగా నంది బహుమతి అందుకున్నారు. ఈమె నటించిన సినిమాల్లో ‘శుభలగ్నం’ చెప్పకోదగ్గది. ఇప్పుడు వివిధ పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు.