09-09-2025 06:11:44 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గిరిజనుల జాబితాలోని లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లంబాడీలు కదం తొక్కి నిరసనలు తెలియజేశారు. లంబాడీలను గిరిజనుల జాబితా నుంచి తొలగించి రిజర్వేషన్ల రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు పిటిషన్ వేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని హనుమకొండలో లంబాడీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం బాలసముద్రం ఠాను నాయక్ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ర్యాలీకి ప్రయత్నించారు.
వారిని పోలీసులు అడ్డుకుని ఎసిపి నరసింహారావు ఆధ్వర్యంలో నిలువరింపజేశారు. దీంతో పోలీసులకు లంబాడి నాయకులకు మధ్య తోపులాట జరిగి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ, సుప్రీం కోర్టు నిర్ణయం కోర్టు లో తేల్చుకుంటామని, హైకోర్టులో తొలగించిన అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు దీన్ని వెనుకఉంది ప్రోత్సహించి చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవిందు నాయక్, జై సింగ్ రాథోడ్, జాటోత్ కిషన్ నాయక్, వీరన్ననాయక్, రాజు నాయక్, సాంబయ్య నాయక్, శంకర్ నాయక్, బానోతు వెంకన్న తో పాటు పెద్ద సంఖ్యలో లంబాడీలు నిరసనలో పాల్గొన్నారు.