17-11-2025 12:26:34 AM
ఘటనా స్థలంలో సైనికులు వాడే బుల్లెట్లు లభ్యం
న్యూఢిల్లీ, నవంబర్ 16: ఢిల్లీ పేలుడు కేసులో వైట్‌కాలర్ టెర్రరిజంపైనా భారత బలగాలు ప్రత్యేక ఫోక్‌స్ పెట్టాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో లింకులున్న డాక్టర్లు ఆదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్‌లను ఇటీవల అరెస్ట్ తెలిసిందే.
ఈ ముగ్గురిలో ఒకరైన ఆదీల్ అహ్మద్‌తో ప్రియాంక శర్మకు పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. అనంత్‌నాగ్‌లో ప్రియాంక ఉంటున్న వసతి గృహంపై దాడిచేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆమె ఫోన్, సిమ్‌కార్డును ఫోరెన్సిక్ బృందాలు పరీక్షిస్తున్నాయని తెలిపారు. దాదాపు 200 మంది కశ్మీర్ వైద్యులపైన, దేశంలోని ప్రముఖ నగరాల్లో కాలేజీలు, వర్సిటీల్లో చదువుకున్న కశ్మీర్ విద్యార్థులపైనా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ పేలుడు కేసును దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ జరపుతున్నాయి. ఘటనా స్థలంలో సైనికులు వాడే బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సైనికులు ఉపయోగించే 9ఎంఎం కార్ట్రిడ్జ్‌లను ఎర్రకోట సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు, అక్కడ ఎటువంటి పిస్టళ్లు కూడా దొరకలేదని పేర్కొన్నారు.
పేలుడు సంభవించిన అప్పటి నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు, భద్రతా సిబ్బందికి ఇచ్చిన బుల్లెట్లను కూడా తనిఖీ చేశామని, అవి కావని తేల్చామని వివరించారు. ఘటనా ప్రదేశంలోకి సైనికుల బుల్లెట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జనంపైకి మదర్ ఆఫ్ సైతాన్
దేశంలో పెనుసంచలనం సృష్టిస్తున్న ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో వైద్యులే ఎక్కువ మంది ఉన్నారు. వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా ప్రయోగించారని తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను తీసుకొచ్చి, అమాయక ప్రజల ప్రాణాలను తీసేందకు కుట్ర పన్నారు. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగించేందుకు సిద్ధం చేశారు.
ఏమిటి టీఏటీపీ?
ప్రపంచవ్యాప్తంగా అక్రమ బాంబుల తయారీదారులు విస్తృతంగా ఉపయోగించడం వల్ల ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ)ను ’మదర్ ఆఫ్ సైతాన్ తల్లి’గా పిలుస్తున్నారు. ఈ టీఏటీపీని ఒక వారం క్రితం దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన పేలుడులో ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. చబడిందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.
ఎటువంటి డిటోనేటర్ లేకుండా టీఏటీపీ కేవలం వేడి కారణంగా పేలిపోవచ్చు అని పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడులో టీఏటీపీ వాడారా లేదా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఘటనకు కారణమైన ఉమర్ రద్దీగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించే ముందు టీఏటీపీ గురించి అతనికి తెలుసని దర్యాప్తు బృందాలు నమ్ముతున్నాయి.
నిపుణులు TATPని చాలా సున్నితమైనదిగా అభివర్ణిస్తారు. ‘ఘర్షణ, పీడనం లేదా పెరుగుతున్న ఉష్ణోగ్రత - భౌతిక వాతావరణంలో ఏదైనా మార్పు ట్రిమర్‌ను అస్థిరపరుస్తుంది. పేలుడును ప్రేరేపిస్తుంది. అమ్మోనియం నైట్రేట్ లాగా దీనికి డిటోనేటర్ అవసరం లేదు, ఇది రసాయనికంగా, ఉష్ణపరంగా స్థిరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.