17-11-2025 12:28:22 AM
నేడు క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం?
మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం?
‘చిరాగ్’కు 3 మంత్రి పదవుల ఛాన్స్!
పాట్నా, నవంబర్ 16: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. బీహార్ సీఎం మళ్లీ నితీశ్ కుమార్ కొనసాగుతారని, ఈ నెల 19న లేదా 20వ తేదీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి ప్రమాణ స్వీకారానికి ఏ తేదీని నిర్ణయిస్తారో ప్రధాని మోదీ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుం ది.
ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానుంది. ఈ మేరకు మైదానంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్ర మానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ 18వ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పిస్తుందని, తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలుపనున్నారు.
తర్వాత నితీశ్ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయి. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీలు సమావేశమై తమ నేతను ఎన్నుకుంటాయి. ఎన్డీయే అధిష్ఠానం కూడా నితీశ్ వైపే ఆసక్తి చూపడంతో నవంబర్ 20న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తుంది.
మంత్రి వర్గ ఫార్మూలా రెడీ
కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గం ఏర్పాటు కోసం కేంద్రమంత్రి అమిత్‌షాతో కూటమి నేతలు శనివారమే సమావేశమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో అధిక భాగం బీజేపీకి దక్కే అవశాం ఉన్నాయని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. తర్వాతస్థానం జేడీయూ ఇతర పార్టీలు ఉన్నాయి. మంత్రివర్గం ఏర్పాటుపై కూటమి పక్షాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ‘ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి’ ఫార్మూలాకు ఎన్డీయేలోని పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 89, జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. ఫార్మూలా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, జేడీయూకు 14, ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీకి మూడు, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎంలకు ఒక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కే పరిస్థితులు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రులు ఎందరు, ఎవరెవరికీ లభిస్తాయనే విషయంపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారమూ లేదు.