17-11-2025 12:24:57 AM
పాట్నా, నవంబర్ 16 : బీహార్ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించారని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇది ఎన్నికలను దెబ్బతీసేందుకు అనైతిక ప్రయత్నం అని ఎన్డీఏ కూటమిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్ల విలువైన ప్రపంచ బ్యాంకు నిధులను బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు మహిళలకు రూ.10వేల నగదు బదిలీ చేయడానికి మళ్లించారని, తద్వారా ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు నితీశ్ ప్రభుత్వం ఓట్లను కొనుగోలు చేయడానికి దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఈ చర్య ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడమే అవుతుందని దీనిపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.