12-08-2024 12:00:00 AM
నిజామాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. కానీ నిజామాబాద్‌లోని డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇవేమీ వర్తించవు. నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న టీ శ్రీనివాస్ తన 35 ఏళ్ల సర్వీసులో 32 ఏళ్లుగా నిజామాబాద్ కళాశాలలోనే విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్ అసిస్టెంట్‌గా 1989లో మెదక్ జిల్లాలో నియమితుడైన అతను 1992లో నిజామాబాద్ డైట్ కళాశాలకు లెక్చరర్‌గా పదోన్నతిపై వచ్చి పాతుకుపోయాడు.
2005లో సీనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ పొందాడు. 2018లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాడు. కళాశాలలో మొత్తం 29 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. లెక్చరర్లు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తన హవా చెలాయిస్తున్నాడు. విద్యార్థులు చెల్లించే ఫీజులను కాలేజీకి కాకుండా తన సొంత ఖాతాలో జమ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
గత కొన్ని సంవత్సరాలుగా రూ.37 లక్షల నిధులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది. అలాగే తనకు నచ్చని అనేక మంది విద్యార్థులను అటెండెన్స్ లేదంటూ అకస్మాత్తుగా కోర్సు నుంచి తొలగించినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
బదిలీచేసి, విచారణ జరిపించాలి
నిబంధనలు పాటించని, అవినీతి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమా నాలకు తావిస్తున్నది. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కళాశాలలో సరిపడా స్టాఫ్ లేరంటూ కొనసాగించడం తగదు. శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు వెంటనే బదిలీచేసి, విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ కర్క గణేష్,
పీడీఎస్‌యూ నేత, నిజామాబాద్