calender_icon.png 26 January, 2026 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహసానికి సలాం!

26-01-2026 02:26:13 AM

  1. దేశవ్యాప్తంగా 982 మందికి పోలీసు పతకాలు

15మంది తెలంగాణ అధికారులకు కేంద్ర పురస్కారాలు

జమ్మూ కశ్మీర్‌కు అత్యధిక శౌర్య పతకాలు

వ్యోమగామి శుభాంశు శుక్లాకు ‘అశోక చక్ర’

పలువురి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, జనవరి 25 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 982 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 125మందికి శౌర్య పతకాలు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం అత్యధికంగా 33 శౌర్య పతకాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్ర 31 పతకాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ పోలీసులకు 18, ఢిల్లీ పోలీసులకు 14 పతకాలు లభించాయి.

దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరులకు ఈ గౌరవం దక్కింది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న వారికి కేంద్రం పెద్దపీట వేసింది. జమ్మూ కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తిస్తున్న 45మంది సిబ్బందికి శౌర్య పతకాలు దక్కాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోరాడుతున్న 35 మందికి సాహస పురస్కారాలు లభించాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న ఐదుగురికి శౌర్య పతకాలు ప్రకటించారు. అగ్నిమాపక విభాగం నుంచి నలుగురు సాహసికులు ఈ జాబితాలో నిలిచారు. కేంద్ర సాయుధ బలగాల్లో సీఆర్పీఎఫ్ ఒక్కటే 12 శౌర్య పతకాలను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులను ఈ పురస్కారాలు వరించాయి.

101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఈ ఏడాది 101 మందికి లభించాయి. విధి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించిన వారికి ఈ గౌరవం దక్కుతుంది. అలాగే విలువైన సేవలు అందించిన 756 మందికి మెరిటోరియస్ సేవా పతకాలు  ప్రకటించారు. పౌర రక్షణ, హోంగార్డుల విభాగం నుంచి 33 మందికి మెరిటోరియస్ పతకాలు అందజేశారు. కారాగారాల శాఖలో పనిచేస్తున్న 25మందికి కూడా ఈ గుర్తింపు లభించింది. ఏటా గణతంత్ర వేడుకల వేళ ప్రకటించే ఈ పతకాలు పోలీసు బలగాల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.

తెలంగాణ అధికారులకు విశిష్ట గౌరవం 

తెలంగాణ నుంచి మొత్తం 15మంది అధికారులు కేంద్ర పురస్కారాలకు ఎంపికయ్యారు. అడిషనల్ ఎస్పీ మందా జి.ఎస్. ప్రకాష్‌రావు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని అందుకోనున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ అన్నూ దామోదర్ రెడ్డి సైతం ఇదే విభాగంలో పతకం సాధించారు. హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి అసాధారణ సాహసానికి గుర్తింపుగా శౌర్య పతకం లభించింది. ఐజీ బడుగుల సుమతి మెరిటోరియస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. కమాండెంట్ పాగుంట వెంకట్ రాములు, డీసీపీ కేవీఎం ప్రసాద్ ఈ జాబితాలో ఉన్నారు.

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొగిలిచర్ల శంకర్ కూడా పురస్కారం పొందారు. సబ్ ఇన్‌స్పెక్టర్లు వి.పురుషోత్తం రెడ్డి, సయ్యద్ అబ్దుల్ కరీం, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు టి. శ్రీనివాసరావు మెరిటోరియస్ పతకాలు అందుకున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు బి.రమేష్, ఎం.కిషన్ రావు, పి.సంజీవరావు వంటి వారు తమ విశిష్ట సేవలకు గానూ కేంద్రం నుంచి గుర్తింపు పొందారు.

  1. శుభాంశు శుక్లాకు ‘అశోక చక్ర’
  2. మరో ముగ్గురికి కీర్తి చక్ర  

భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు కేంద్రం ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం ’అశోక చక్రను ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు రికార్డు సృష్టించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు చెందిన 70 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.

వీరిలో ఆరుగురికి మరణానంతరం ప్రకటించారు. మేజర్ అర్ష్ దీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లకు ‘కీర్తి చక్ర’ పురస్కారాలు వరించాయి. 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేన పతకం, 44 మందికి సేన, ఆరుగురికి నౌ సేన, ఇద్దరికి వాయు సేన పతకాలు ప్రకటించారు.