24-11-2025 01:35:34 AM
మరీ ఇంత మొహమాటమే నీ వెనుకబాటుకు మూలం నిన్ను వెనక్కు వెనక్కు నెట్టేస్తున్న నీలోని తిమిరం అదే !
అడుగు ముందుకు వేయాలా వద్దా వేస్తే ఏమనుకుంటారో వాళ్లను దాటెయ్యటం దాటుకొని వెళ్లటం అంత బాగోదేమో వాళ్లు ముందు వెళ్లనీ పక్కకు జరుగుదాం !
కొన్ని అనామక అజ్ఞాన ఊసరవెల్లులు మనవల్లే దార్లు పరుచుకుంటాయి వెనుకబడిన అడుగుల ఆనవాళ్లను చూసి నువ్వు లోలోన దుఃఖాశ్రువైతావు
బతుకంతా పదే పదే వల్లె వేసుకున్న నీ భవిష్యత్తును నీలోనే పాతుకుని పాతుకుని నిట్టూర్పులు వొదులుతావు
ప్రతిరోజు ఓ కొత్త వాక్యంగా ప్రారంభమై పాత చిరునామాలా చితికిల పడతావు వేల వేల భావాల స్ఫూర్తి ప్రవచనంలా గొప్పగా కదిలి నోరు పెకలని మౌన ముద్రలో కాలాన్ని వృథాప్రయాసలా కోల్పోతావు
నీపై జాలీ కరుణ సానుభూతి వెగైైరా వెగైైరా అన్నీ మొనతేలిన గునపమై తొలుస్తుంది కట్టలు తెంచుకుంటున్న దుఃఖపు రాశిని నింపాదిగా దాచుకోవడం నీ నైజం ఎద్దుపుండు కాకికి ముద్దునట్టు నీ నిశ్శబ్దాల అంతర్మథనాల బాధాలోకపు ఆపసోపాల సందిగ్ధ కాలగమనం వాళ్లకు వర్షపు చినుకుల మధ్య తేనీరు
నీకు సత్తా ఉండి.. సామర్థ్యం ఉండీ గెలుపు గీతకు ఈవల ఆగిపోవటం నీ ఒకానొక రుగ్మత
హలో.. లేపనం లేని గాయాలుంటాయి గ్రహించు గుండె దిటవు చేసుకో నీ దీటైన నడతే క్షత గాత్రమవుతున్న మనసుకు ఊరట
ఎవరో ఏమనుకుంటారో అని కించిత్ అయినా సంకోచించకు నీలో పాకురుపట్టిన న్యూనత ఫంగస్‌ను ఇప్పుడే.. ఈక్షణమే సల సల సలపరించే నీ తపనల తేజాబ్‌తో శుభ్రంగా కడిగేయ్ తప్పకుండా నువ్వు రేపు గొప్ప సూర్యోదయాన్ని చూస్తావు !