calender_icon.png 30 October, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు బాగా లేకపోతే నన్నే నిందిస్తారు

30-10-2025 01:18:13 AM

-నేను ఒక్కడినే ఎందుకు తిట్లు తినాలి?

-రోడ్లపై క్యూఆర్‌కోడ్ ఏర్పాటు చేస్తాం

-జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకే ఈ విధానం  

-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశంలో రోడ్లు బాగా లేకపోతే అందరూ తననే నిందిస్తారని.. మొత్తం వ్యవస్థ చేసిన తప్పునకు తాను మాత్రమే ఎందుకు తిట్లు తినాలని, సోషల్ మీడియాలో ఆరోపణలపై ఎందుకు స్పందించాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ‘రోడ్లపై క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయడం వల్ల దానిని మంజూరు చేసిన మంత్రి ఎవరు, దాని నిర్మాణం కోసం పనిచేసిన కార్యదర్శులు, కాంట్రక్టర్లు, ఇంజినీర్లు వారి ఫోన్ నంబర్లు, ఫొటోతో సహా అన్ని వివరాలు ప్రజలకు, మీడియాకు అందుబాటులో ఉంటాయన్నారు.

దీంతో ఆయా రోడ్లపై ఏదైనా సమస్య వస్తే వారు నేరుగా ఆ అధికారులనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘స్మార్ట్ రోడ్ల భద్రత’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్‌లను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాజెక్టు కోసం పని చేసిన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, నిర్మాణానికి మంజూరు చేసిన బడ్జెట్, గడువు, నిర్వహణ వంటి కీలక వివరాలు వెల్లడవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. రోడ్లు బాగా లేకపోతే అందరూ తననే నిందిస్తారని.. అందుకే రోడ్లకు సంబంధించిన సమాచారమంతా ప్రజలకు బహిర్గతం చేయాలనే ఉద్ధేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అప్పుడే రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.