08-11-2025 12:00:00 AM
-ఐదు రోజులుగా నరకయాతన
-పట్టించుకోని వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు
-ఉన్నతాధికారులకు తెలిసినా పట్టింపు శూన్యం
నాగర్ కర్నూల్ నవంబర్ 7 (విజయక్రాంతి): నిరుపేదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉచిత నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని మూతబడి కనిపించగా పెద్దకొత్తపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి ఫై కప్పు పెచ్చులూడుతున్నాయి. మరి కొన్ని కనీస వసతులు లేక చీకట్లో మగ్గుతున్నాయి. సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం, విద్యుత్ శాఖ అధికారుల ఉదాసీనత ఫలితంగా నిరుపేద రోగులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదు రోజులుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల కారణంగా ఆసుపత్రికి సరఫరా అయ్యే ప్రధాన ద్వారం వద్ద నిప్పురవ్వలు రాజుకొని విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మండల వైద్యాధికారి నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ అధికారులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో విద్యుత్ అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తూ నేటికీ విద్యుత్ పునరుద్ధరణ చేయకపోవడం విశేషం. ఫలితంగా నిత్యం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఎమర్జెన్సీ రోగులు నానా యాతన గురవుతున్నారు. ఆస్పత్రిలో స్టోరేజ్ ఉన్న వ్యాక్సిల్ సెంటర్ సైతం వైద్య సిబ్బంది పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నిత్యం ఆసుపత్రికి వందకు పైగా రోగులు వచ్చి వెళ్తుంటారు. రాత్రివేళలో సుమారు 50 మందికి పైగా ఆసుపత్రిని ఆశ్రయిస్తారు.
కానీ వారందరికీ వైద్యం అందించకుండా సిబ్బంది పూర్తిగా డుమ్మాకొట్టి కేవలం కంటి తుడుపుగా ఒకరిని అందుబాటులో ఉంచారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్ సహాయంతో ఆసుపత్రి ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం మినహా రోగులకు వైద్యం అందించడం లేదని రోగులు మండిపడుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు సైతం తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్ వివరణ కోరగా భారీ వర్షం కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయంపై జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వెంకట నరసింహారెడ్డి వివరణ ఇస్తూ సమస్య తన దృష్టికి రాలేదని వెంటనే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు.