calender_icon.png 8 November, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డంతా గుంతలు!

08-11-2025 12:00:00 AM

ప్రయాణానికి వాహనదారుల తిప్పలు మరమ్మతుకు అధికారుల నిర్లక్ష్యం

నకిరేకల్, నవంబర్ 7 (విజయక్రాంతి) : నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని నేషనల్ హైవే65 నుంచి చెర్వు అన్నారంకురుమర్తి వరకు ఉన్న బీటీ రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి ప్రమాదాలకు దారితీస్తోంది. సుమారు 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి సుమారు 2005 ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.

మొదట్లో రహదారి బాగానే ఉన్నప్పటికీ, తరువాత పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో మరమ్మతులు జరగలేదు. చెర్వు అన్నారం శివారులో ఏర్పడ్డ రైస్ మిల్లులు, క్రషర్ యూనిట్ల భారీవాహనాల రాకపోకలు, గతంలో అక్రమ ఇసుక రవాణా వాహనాలు, వర్షాకాలంలో నీరు నిల్వవడం, అలాగే రైతులు ట్రాక్టర్లకు ఫుల్వీల్స్ వేసి ఈ మార్గంలో ప్రయాణించడం వలన రహదారి తీవ్రంగా దెబ్బతింది. పైపులైన్లు, కాలువల కోసం తవ్వకాలు చేయడం వల్ల పరిస్థితి మరింత దారుణమైంది.

ఈ మార్గం గంగాదేవిగూడెం, చెర్వుఅన్నారం,తేలువారిగూడెం, గార్లబాయిగూడెం గ్రామాల ప్రజలకు ప్రధాన రవాణా మార్గం కావడంతో రోజూ వందలాది మంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. గుంతల మయమైన రహదారి కారణంగా రాత్రిపూట ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుపై దృష్టి పెట్టడం లేదు. వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరమ్మతుల కోసం నిధులు మంజూరు ..

చెర్వు అన్నారంకురుమర్తి బీటీ రహదారి పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం 2025 మార్చి తర్వాత 287.5(2 కోట్ల 87లక్షల 50వేలు) రుపాయలు  ఎం.ఆర్.ఆర్. గ్రాంట్ కింద మంజూరైనట్లు అధికారులు తెలిపారు. గతంలో టెండర్లు ఆహ్వానించినప్పటికీ, బడ్జెట్ విడుదలలో అనిశ్చితి, బిల్లుల చెల్లింపులపై సందేహాల కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని సమాచారం. అయితే మళ్లీ టెండర్లు ఆహ్వానించి త్వరలో పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.