12-09-2025 12:00:00 AM
-హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ముంచెత్తిన వరద నీరు
-హయత్ నగర్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో భారీగా వరద
-ఆటోనగర్ టు అంబర్‌పేట వరకు భారీగా ట్రాఫిక్‌జామ్
-వనస్థలిపురంలోని కొలత కాలనీలో ఇళ్లలోకి వరద నీరు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 11 : ఎల్బీనగర్ నియోజకవర్గం లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, మనసురాబాద్, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో క్లౌడ్ బ్లాస్ట్ అయ్యిందా? అనే విధంగా వర్షం దంచి కొడుతోంది. వనస్థలిపురం, హయత్ నగర్ డివిజన్ లోని పలు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
ఆయా కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. చింతలకుంట, పనామా చౌరస్తా, ఆటోనగర్, అంబర్పేట్ వరకు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలోమీటర్ వరకు ట్రాపిక్ జాం అయ్యింది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో..
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 11: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అబ్దుల్లాపుర్ మెట్ మండల పరిధిలో పెద్ద అంబర్‌పేట్, కుంట్లూరు తట్టిఅన్నారం, బాచారం, తారామతిపేట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిసరా ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్2లో భూదాన్‌లో నిరుపేదలు వేసిన గుడిసెలలోకి వర్షపు నీరు చేరి పూర్తిగా జలమయమయ్యాయి.
సంగం కలాన్ లో విషాదం.. వాగు దాటుతుండగా వ్యక్తి గల్లంతు.
తాండూరు, 11 ఆగస్టు, (విజయక్రాంతి); వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సంగం కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు మొగులప్ప ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఇంటికి వెళ్లేందుకు గ్రామ శివారులో ఉన్న దిడ్డి వాగును దాటుతుండగా వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మొగులప్పను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. రైతు మొగులప్ప ఆచూకీ కోసం రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు అన్వేషిస్తున్నారు.