19-08-2025 12:00:00 AM
జనగామ, ఆగస్టు 18 (విజయ క్రాంతి) ః సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి పంచాయతీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే అనంతరం జిల్లా అధికారులతో భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి వంటి అంశాలపై సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు.
వర్షాలకు శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలను ఉండనీయరాదని అదేవిధంగా పొంగిపొర్లుతున్న వాగులు వంకలు దాటినీయరాదని తెలియజేశారు... క్షేత స్థాయిలో అధికారులు పర్యటిస్తూ , ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఫర్టిలైజర్స్ పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
సీజనల్ వ్యాధులు సోకకుండా, మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించాలని దోమలు ప్రబలే అవకాశం ఉన్నందున ఫాగింగ్ చేపట్టాలన్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు రాకుండా ఫీవర్ సర్వేకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 24/7 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర పరిస్థితులల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ కు 9052308621 సమాచారం అందించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలన్నారు ఇందిరమ్మ ఇండ్ల కు సరఫరా చేసే ఇసుకలో లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, ఆర్డిఓ గోపి రామ్, డిప్యూటీ కలెక్టర్లు కొమురయ్య, సుహసిని, డి ఆర్ డి ఓ వసంత పాల్గొన్నారు.