calender_icon.png 10 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వాహనాలు బలాదూర్?

10-11-2025 12:00:00 AM

  1. పట్టించుకోని పోలీసు, రవాణా శాఖల అధికారులు
  2. పరిమితికి మించిన లోడ్‌తో నిషేధ సమయంలోనూ రాజధానిలోకి వస్తున్న వాహనాలు
  3. నిషేధ సమయంలోనూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోజూ వేలాది ప్రైవేటు బస్సుల స్వైరవిహారం
  4. ‘మామూళ్లు’ ఇస్తే చాలు..
  5. ఇప్పటికే ట్రైకమిషనరేట్ల పరిధిలో 88 లక్షలకుపైగా వాహనాలు

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : రాజధానిలో రోడ్లపై వెళ్లేవారికి ఉన్నట్టుండి పక్కనుంచి ఒక భారీ వాహనం రయ్యిమని వెళ్తే ఎలా ఉంటుంది.. నిషేధం విధించిన సమయంలోనే భారీ వాహనాలు రోడ్లపై తిరగడం హైదరాబాద్ ప్రత్యేకత!. ఒక పక్క వాహనాల నుంచి వెలువడే ధ్వని, వాయు కాలుష్యంతో ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్న హైదరాబాద్ నగరవాసులపై.. రోలు చుట్టపై రోకలి పోటులా.. నిషేధాన్ని పట్టించుకోకుండా తిరిగే భారీ, ప్రైవేటు గూడ్స్, బస్సుల లాంటి వాహనాలు దినదినగండంగా మారాయి.

ఈ భారీ, ప్రైవేటు వాహనాల నుంచి నగరవాసులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు, రవాణా శాఖలు ఎందుకనో నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయని నగర ప్రజల నుంచి తీవ్ర విమ ర్శలు వస్తున్నాయి. వెరసి నగర రోడ్లపై వచ్చే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. తమ పనులు పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకోవాల్సి వస్తోంది. పైగా ఇదే పరిస్థితి రోజూ ఉందంటే భారీ వాహనాలు ఏ స్థాయిలో సిటీ రోడ్లపై తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

వాహనాల సంఖ్య 88 లక్షలకుపైగా.. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో.. సూటిగా చెప్పాలంటే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొం డ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 2024 చివరి నాటికి  88 లక్షలకు పైగా వాహనాలు (అన్ని కేటగిరీలు) తిరుగుతున్నాయి. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 70 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యా ప్తంగా 1.5 కోట్ల వాహనాలు ఉంటే.. ఒక్క హైదరాబాద్ నగరంలోనే అందులో సగం ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా దీనికితోడు ప్రతిరోజూ సగటున 1,500 వాహనాలకుపైగా కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.

గూడ్స్, ప్రైవేటు బస్సులు కూడా భారీగానే..

హైదరాబాద్ నగరంలో తిరుగాడే వాహనాల్లో కార్లు, జీపులు, ద్విచక్రవాహనాలే కాదు.. ప్రైవేటు గూడ్స్, బస్సుల సంఖ్యకూడా భారీగానే ఉంది. అధికారిక గణాం కాల ప్రకారం.. ఈయేడు మార్చి నాటికి 6.60 లక్షల గూడ్స్ క్యారేజ్ వాహనాలు, 1.45 లక్షల మోటారు క్యాబ్‌లు, 27 వేల మాక్సి క్యాబ్‌లు నగర రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. దీనికితోడు నగర రోడ్లపై సుమా రు 3,000 ఆర్టీసీ బస్సులుకూడా తిరుగుతున్నాయి. వీటికి తోడు.. ఇతర రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు అదనం.

ప్రజల ప్రాణాలకు ముప్పు..

ఇప్పటికే నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో అటు ట్రాఫిక్ పరంగా.. ఇటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న ప్రజలు.. ప్రైవేటు గూడ్స్, బస్సుల రాకతో మరింత ప్రమాదంలోకి వెళుతున్నారు. కేవలం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 2023, 2024 రెండు సంవత్సరాల కాలంలో సు మారు 58 మంది ప్రజలు వాహన ప్రమాదాల్లో చనిపోయారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు గూడ్స్, బస్సు ల సంచారంపై హైదరాబాద్ పోలీసులు నిషేధం విధించినా.. నిషేధం విధించిన సమయంలోనే ఆయా వాహనాలు సంచరిస్తుంటాయి.

నగరంలో ఉదయం 7 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అటు తరువాత సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ సమయాల్లో ఆఫీసు పనులకు, విద్యా సంస్థలకు, ఇతర పనులపై వెళ్ళే ప్రజలతో వాహనాలు కిక్కిరిసి ఉంటాయి. ఈ సమయాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి ప్రవేశించడానికి ప్రైవేటు గూడ్స్, బస్సులు, ఇతర భారీ వాహనాలపై నిషేధం విధించారు. అయితే ఇదేమీ వాస్తవానికి అమ లుకావడం లేదు.

నిబంధనలు తూచ్.. 

పకడ్బందీగా నిషేధం విధించినా... ప్రైవేటు భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, ప్రైవేటు బస్సులు మాత్రం యధే చ్చగా నిషేధిత సమయాల్లోనే సంచరిస్తుండటంతో.. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు బస్సులు ఉదయం 8 గంటల తరువాత.. రాత్రి భారీ ట్రాఫిక్ ఉండే 8 గంటల సమయంలోనూ నగర రోడ్లపై పోటీపడుతూ పరుగులు పెట్టడం ప్రజలందరూ చూస్తున్నదే.

ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన బస్సులు ప్రతిరోజూ వేలాదిగా నగర రోడ్లపై నిషేధిత సమయాల్లో  సంచరిస్తూనే ఉన్నాయి. అయి నా పోలీసు శాఖ పట్టించుకున్న పాపా న పోలేదు. కిందిస్థాయిలో సిబ్బంది, వారి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అధికారులుకూడా ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసు కుంటున్నారు. దీనితో ప్రైవేటు బస్సుల కర్ణకఠోరమైన హారన్‌లతో ప్రజల చెవులు చిల్లులు పడటమే కాదు.. ప్రాణాలే హరీ మంటున్నాయి.

ఉదయం 8 గంటల లోపే నగరంలోకి ప్రవేశిస్తున్న ప్రైవేటు భారీ బస్సులు.. ఉదయం 11 గంటల వరకుకూడా ప్రయాణీలను దింపుతూ కనపడుతుంటాయి. ఉదయం 8 గంటల లోపలే విజయవాడ నుంచి వస్తున్న బస్సులు ఓఆర్‌ఆర్ దాటి నగరంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ.. ఉదయం 10 గంటలకుకూడా అమీరుపేట, మియాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో ప్రయాణీకులను దింపుతూ కనపడుతుంటాయి. 

నిషేధాజ్ఞలు.. 

నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న నగర కొత్వాల్ నగరంలోకి భారీ, ప్రైవేటు గూడ్స్, బస్సులు, నేషనల్ పర్మిట్, లోకల్ లారీలు, మీడియం గూడ్స్, నెమ్మదిగా వెళ్ళే వాహనాల ప్రవేశాన్ని కొంత సమయానికే పరిమి తం చేస్తూ.. ఇతర సమయాల్లో నిషేధిస్తూ నోటిఫికేషన్ (టీఆర్.టీ4/685/2024, తేది 20.2.2024) విడుదల చేశారు. దీని ప్రకా రం అంతర్‌జిల్లా, భారీ వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్‌లు, టస్కర్లు, ట్రెయిలర్లను (ఎన్3, టీ4 కేటగిరీ) వివిధ రూట్లలో ప్రయాణించడాన్ని డే అండ్ నైట్ నిషేధించారు.

ఇదే ఎన్3, టీ4 గ్రేడ్‌లోకి వచ్చే లోకల్ లారీలు, నిర్మాణ సామగ్రిని తరలించే లారీలు, ట్రక్‌లు, టస్కర్లు, ట్రెయిలర్లు, ఆర్‌ఎంసీ, ఎర్త్ మూవింగ్ లాంటి వాహనాలు (సీఈవీ) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యన నగర రోడ్లపై తిరడంంపై నిషేధం విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యన మాత్రమే నగరంలోకి ప్రవేశంచవచ్చు. ఇక మీడియం గూడ్స్ వాహనాలు అయిన డీసీఎం, ఐషర్, స్వరాజ్‌మజ్దా లాంటివి (ఎన్2, టీ3 కేటగిరీ) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నగర రోడ్లపైకి రావ డం నిషేధం. 

ప్రైవేటు బస్సుల విషయానికి వస్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూర్తి నిషేధం. అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నగరంలోకి ప్రవేశించవచ్చు. ఆర్టీసీకి మినహాయింపు ఉంది. ఇక నిర్మాణ వ్యర్థాలను (సీ అండ్ డీ) తరలించే వాహనాలు (2 టన్నుల నుంచి 6 టన్నులు) జంట నగరాల పరిధిలో ఉదయం 9 నుంచి 11 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు నగర రోడ్లపై సంచరించడం నిషే ధం. 10 టన్నుల సామర్థ్యానికిపైగా ఉండే భారీ వాహనాలను ఉదయం 7 గంటల నుంచి రాతిర 11 గంటల వరకు నగర రోడ్లపై సంచరించడాన్ని నిషేధించారు.

2024లో ట్రైకమిషనరెట్ల పరిధిలో ఇలా నిషేధ సమయంలో నగరంలోకి ప్రవేశించిన భారీ వాహనాలపై 75,000 కేసులు నమో దు చేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. కేసులు పెట్టినవే ఇంతుంటే.. ఇక వదిలేసినవి, చూసీ చూడనట్టుగా వ్యవహరించిన వాహనాల సంఖ్య ఎంతుంటాయనేది ప్రజ లు అర్థం చేసుకోవచ్చు. అదే పరిమితికి మించి లోడ్‌తో వస్తున్న వాహనాల విషయంలో ఇటు పోలీసుతోపాటు అటు రవా ణా శాఖ సిబ్బంది, అధికారులుకూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉండనే ఉన్నా యి.

దీనికితోడు నిర్మాణ, ఇతర వ్యర్థాలను తరలించే భారీ వాహనాలు, ట్రక్కులు కూడా ఇష్టారాజ్యంగా నగర రోడ్లపై ప్రయాణించడం షరా మామూలే. రాళ్ళు, రప్పలు, నిర్మాణ వ్యర్థాలు తరలించేటప్పుడు నిబంధనలు పట్టించుకోకుండా డోర్లు వేయకుండా, వాటిపై కవర్లు కప్పకుండా తరలిస్తుండగా ప్రమాదాలు జరిగిన సంఘటనలుకూడా ఉన్నాయి.

వీటన్నింటికీ కారణం.. పోలీసు, రవాణా శాఖ నిర్లక్ష్యం. అటు కాలుష్యంతో పోరాడుతూనే.. ఇటు భారీ వాహనాల నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి నగర ప్రజలు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది.