20-01-2026 04:16:28 PM
హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. భవిష్యత్తులో సినిమా టికెట్ల ధరల సవరణపై తీసుకునే ఏ నిర్ణయాలనైనా సినిమా విడుదల తేదీకి కనీసం 90 రోజుల ముందుగానే ఖరారు చేసి ప్రకటించాలని ధర్మసనం మంగళవారం ఆదేశించింది. తాజాగా విడుదలైన చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు అనే తెలుగు సినిమాకు టికెట్ ధరల పెంపునకు ఇటీవల ఇచ్చిన ఆమోదాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ అధ్యక్షతన ఉన్న హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది.
సినిమా టిక్కెట్ల ధరల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ, సినిమా టిక్కెట్ల ధరల పెంపును ఆమోదిస్తున్నప్పుడు హోం శాఖ పర్యవేక్షణ లోపించినందుకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్‌కు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన అర్థరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు, ప్రీమియర్ కు అనుమతి ఇస్తూ మోమో జారీ చేయడంపై ఈ నెల 9 తేదీన వాదనలు జరిగాయి. సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో సవాలు చేశారు. అదే సమయంలో మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జీపీని ఆదేశించని ధర్మసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.