calender_icon.png 9 August, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ సెక్యూరిటీ రాజధాని హైదరాబాద్

09-08-2025 03:10:57 AM

  1. నగరంలోనే దేశంలోని తొలి సైబర్ సెక్యూరిటీ బ్యూరో
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): దేశానికి సైబర్ సెక్యూరిటీ రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దేశంలోని తొలి రాష్ట్రస్థాయి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయనన గుర్తు చేశారు. జోహూ కార్పొరేషన్‌కు చెందిన ఎంటర్‌ప్రైజ్ ఐటీ మేనేజ్‌మెంట్ విభాగం మేనేజ్ ఇంజిన్ హైదరాబాద్‌లో శుక్రవారం షీల్డ్ ఎన్‌ఎక్స్‌జీ 2025 కనెక్ట్ సిరీస్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో నెలకు 12 వందల కేసులను పరిష్కరించడమే కాకుండా దేశంలోనే అత్యధిక శిక్ష విధింపు రేటును కలిగి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్‌ను విస్తరించి గ్రామీణ ప్రజలకు మద్దతును అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సాంకేతిక పరిణామానికి అనుగుణంగా డిజిటల్ చట్టాలు మారాలని సూచిస్తూ డిజిటల్ ఇండియా యాక్ట్ రూపకల్పనలో తెలంగాణ పాత్రను, డీపీడీపీ యాక్ట్ సమర్థవంతమైన అమలుపై రాష్ట్ర ప్రభుత్వ కట్టుబాటును వివరించారు

గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ఎథికల్ హ్యాకింగ్ ఫెలోషిప్, పాఠశాలల్లో సైబర్ హైజీన్ విద్య, టాస్క్ అకాడమీ ద్వారా ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ శిక్షణలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం భాగస్వామ్యాన్ని పెంచి యువ ఎథికల్ హ్యాకర్లకు మెంటర్‌షిప్, ఎంఎస్‌ఎంఈల కోసం సైబర్ రిసిలియెన్స్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన అవసరమని పిలుపునిచ్చారు.