24-12-2025 12:56:55 AM
మాజీ సర్పంచ్ల ఫోరం కార్యవర్గ సభ్యులు మేకల మహేందర్
వెంకటాపూర్, డిసెంబర్23(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సర్పంచులకి ప్రభుత్వం గౌరవ పెన్షన్ ఇచ్చి గౌరవించాలని మాజీ సర్పంచ్ల ఫోరం కార్యవర్గ సభ్యులు అడవిరంగపూర్ మాజీ సర్పంచ్ మేకల మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో సర్పంచులు అభివృద్ధి కోసం అప్పులు చేసి అభివృద్ధి చేస్తే చేసిన బిల్లులు సంవత్సరాలుగా రాక అప్పులపాలయ్యారని, అప్పులు భరించలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కొన్ని కుటుంబాలు గ్రామాలలో ఉండకుండా పట్టణాలకు వలసలు వెళ్లారని, మాజీ సర్పంచులకు గత ప్రభుత్వంలో పనులు చేసిన బిల్లులు ఇంతవరకు ఇప్పటి ప్రభుత్వం కూడా ఇంకా చెల్లించలేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. ఈ ప్రభుత్వం మేనిపెస్టోలో ఇచ్చిన హామీలో మాజీ సర్పంచులకు పెన్షన్ని ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచులకు గౌరవంగా పెన్షన్ ఇవ్వాలన్నారు. మాజీ సర్పంచుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని కోరారు.