calender_icon.png 24 December, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీతోనే ఆర్థిక విప్లవం

24-12-2025 12:57:44 AM

  1. రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్
  2. వంగరలో పీవీకి ఘన నివాళి
  3. అసంపూర్తి పనులను ఏడాదిలో పూర్తిచేస్తామని వెల్లడి

భీమదేవరపల్లి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రపంచంలోనే దేశాన్ని ముందంజలో నిలిపిన ఘనత భారతరత్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కొనియాడారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పీవీ ఇంట్లో మంగళవారం ఆయన విగ్రహానికి హనుమంతరావు, వంగర సర్పంచ్ గజ్జల సృజన రమేష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పీవీ స్వగ్రామమైన వంగరలో సమస్యలు తీర్చడానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి ఏడాదిలోగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వంగర గ్రామంలోని పివి కాన్ఫరెన్స్ హాల్, ముల్కనూర్ సమ్మక్క నుండి వంగర వరకు నాలుగు కోట్లు ఖర్చు చేసి తారు రోడ్డు పనులు పూర్తిచేసే బాధ్యత తనదే అన్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత సోనియాగాంధీ పీవీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుందని ప్రధానిగా చేశారని చెప్పారు.

ప్రధానిగా ఉన్న సమయంలో పివి ఏఐసిసి అధ్యక్షులుగా తాను తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ల పీసీసీ అధ్యక్షులుగా పనిచేశామని చెప్పారు. వంగరలోని పివి మ్యూజియం ఉన్నచోట పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా గార్డెన్ ఏడాదిలోగా పూర్తవుతుందన్నారు.

కాగా విజయక్రాంతి దినపత్రిక దిన దిన అభివృద్ధి చెందుతూ, ఉపయోగకరమైన కథనాలు అందిస్తున్నదని వీహెచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి శ్రీరామోజు సమ్మయ్య, తిరుపతిరెడ్డి, సతీష్‌రెడ్డి, ఒల్లాల రమేష్ మర్రి దేవరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు సుహాసిని పాల్గొన్నారు.