28-10-2025 11:41:29 PM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ వార్డు నెంబర్ 1 లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం, గృహ నిర్మాణ శాఖ పి. డి. వేణుగోపాల్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కొరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కేటాయించి గూడు కల్పిస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పథకంలో లబ్ధి పొందిన వారు ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ఉచితంగా ఇసుకను అందిస్తుందని, నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇండ్లకు బిల్లులు విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై క్షేత్రస్థాయిలో సందర్శించి లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందించాలని, నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం ఆర్థికంగా వెనుకబడిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మండల సమాఖ్య ద్వారా రుణ మంజూరు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మధుకర్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఐ కె పి సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.