27-05-2025 01:19:01 AM
- ఏదైనా ఉపాయం చూడాలని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు
- కాంగ్రెస్‌ను నమ్మి పాలమూరు ప్రజలు బొక్క బోర్లాపడ్డారు
- పార్టీ నుంచి పోయినోళ్లు సన్నాసులు వారిని పండబెట్టితొక్కాలి
- ఉపఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేలా బుద్ధిచెప్పాలి
- జూన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ దరిద్రపు పాలన ఇంకెన్ని రోజు లు చూడాలని ప్రజలు అడుగుతున్నారని, ఏదైనా ఉపాయం చూడమని తమను కోరుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పార్టీ విడిచి పోయిన పదిమంది ఎమ్మెల్యేలు సన్నాసులని, వారికి రాబోయే ఉపఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. వారిని పండబెట్టి తొక్కాలని ఆవేశంతో కాకుండా ఆవేదనతో చెప్తున్నానన్నారు. త్వరలో గద్వాలకు కూడా ఉపఎన్నిక రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో సామాన్య కార్యకర్తను పెట్టినా గులాబీ జెండాను ఎగరవే స్తామన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గద్వాల నియో జకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారం కోసం ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి, నాలుగు కోట్ల ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఉపఎన్నికలు వచ్చినా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమనినాదాలనే విధానాలు గా మార్చుకుని బీఆర్‌ఎస్ పదేళ్లపాటు ఓ మహాయజ్ఞంలా పనిచేస్తే, రేవంత్‌రెడ్డి గత 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై పనికిరాని నిందలు.. బిల్డర్లు - కాంట్రాక్టర్లతో దందాలు.. రాహుల్‌గాంధీకి చందాలు పంపడమే.. విధానంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఉత్త మాటల మనిషి మాత్రమే కాదన్న కేటీఆర్, ఆయన ఢిల్లీకి మూటలు మోసే మనిషిగా మారిపోయారని ధ్వజమెత్తారు.
‘ఒకప్పు డు చంద్రబాబు కోసం మూటలు మోసి అడ్డంగా దొరికిపోయారు.. ఇప్పుడు రాహుల్‌గాంధీ కోసం ఢిల్లీకి మూటలు మోస్తున్నా రు.. ఎప్పుడు ఎవరిని బెదిరించాలి.. ఎవరిని దోచుకోవాలి.. దోచుకున్న సొమ్మును ఢిల్లీకి ఎలా పంపాలనే ఆలోచన తప్ప, తెలంగాణపై పట్టింపు లేదు..’ అని దుయ్యబట్టారు.
గతంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాలనే అందరికీ చూపించుకుంటూ తిరుగుతున్నారని, కాంగ్రెస్ సర్కారుకు ఇప్పుడు అవే దిక్కయ్యాయని తెలిపారు. రాష్ర్టం దివాలా తీసిందని స్వయంగా సీఎం చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముం దుకు వస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
వలస ప్రాంతంగా ముద్రపడ్డ పాల మూ రు ముఖచిత్రాన్ని కేసిఆర్ సమూలంగా మార్చివేశారని, ఆంధ్రా, కర్ణాటక నుంచి పదేళ్ల పాలనలో రివర్స్ మైగ్రేషన్ సాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. గులాబీ జెండా కింద గెలిచిన ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని స్పష్టంచేశారు.
ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నిండామోసపోతామని, తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండా మాత్రమే గుండెధైర్యమన్నారు. జూన్‌లో సభ్యత్వనమోదు ప్రారంభమవుతుందని, గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.