30-01-2026 12:00:00 AM
హుండీ లెక్కింపులో రూ. 2. 31 కోట్ల ఆదాయం
భక్తుల అపార విశ్వాసానికి నిదర్శనం
భద్రాచలం, జనవరి 29, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అత్యంత భద్రతా చర్యల నడుమ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానం నకు మొత్తం రూ.2,31,31,984 నగదు ఆదాయం లభించడంతో ఆలయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారికి చూపుతున్న భక్తి, విశ్వాసానికి ఈ భారీ ఆదాయం ప్రతీకగా నిలిచింది. హుండీ లెక్కింపు ప్రక్రియను దేవస్థాన నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించారు.
నగదు లెక్కింపుతో పాటు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను ప్రత్యేకంగా వేరు చేసి నమోదు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం 56 గ్రాముల బంగారం, 1400 గ్రాముల వెండి భక్తులు సమర్పించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. గత హుండీ లెక్కింపు తేదీ 19 నవంబర్ 2025 కాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన కానుకలను ఈసారి లెక్కించారు. భక్తుల విరాళాలు కేవలం దేశీయ కరెన్సీకే పరిమితం కాకుండా విదేశీ కరెన్సీ రూపంలో కూడా గణనీయంగా లభించాయి.
అమెరికా డాలర్లు 544, సింగపూర్ కరెన్సీ 10, ఆస్ట్రేలియా కరెన్సీ 25, యూరప్ దేశాలకు చెందిన కరెన్సీ 30, దక్షిణాఫ్రికా కరెన్సీ 750, కెనడా కరెన్సీ 10, ఫిలిప్పీన్స్ కరెన్సీ 100, థాయిలాండ్ కరెన్సీ 20, మలేషియా కరెన్సీ 2, నైజీరియా కరెన్సీ 2400, కెన్యా కరెన్సీ 100, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ 105, ఖతార్ రియాల్స్ 2, ఒమాన్ బైజా 100 లభించినట్లు అధికారులు స్పష్టం చేశారు. హుండీ లెక్కింపు లో పోలీస్ శాఖ సహకారంతో పాటు ఆలయ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించడంతో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయడంతో లెక్కింపు సజావుగా ముగిసింది.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు మాట్లాడుతూ, భక్తులు సమర్పిస్తున్న హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, నిత్య అన్నదానం, పూజా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కృపతో ఆలయ ప్రతిష్ఠ మరింత పెరుగుతుండటమే ఈ ఆదాయానికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. దేశ విదేశాల భక్తులు స్వామివారిపై చూపుతున్న అపార విశ్వాసం భద్రాచలం ఆలయానికి మరింత మహిమను తీసుకొస్తోందని, భవిష్యత్తులో భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం భక్తి భావంతో పాటు పారదర్శక పాలనకు ఉదాహరణగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.