calender_icon.png 21 August, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపార నష్టం

21-08-2025 12:27:53 AM

  1. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తీవ్రపంట నష్టం

నష్ట పరిహారం ఇవ్వాలంటున్న రైతులు

వికారాబాద్,ఆగస్టు- 20( విజయ క్రాంతి )  గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. పత్తి,  మొక్కజొన్న, వరి ఇతర పంటలు నీట మునిగిపోయాయి. వేలాది రూపాయల పెట్టుబడి నీటి పాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు వచ్చినట్లే వచ్చి ముఖం  చాటేసిన విషయం తెలిసిందే.

సుమారు 20 రోజుల తర్వాత కురిసిన ఈ భారీ వర్షాలతో రైతులు ఆనందపడాలో దుఃఖ పడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఈ మూడు నెలల్లోనే అనావృష్టి, అతివృష్టి లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మరోవైపు   ప్రకృతి వైపరీత్యాలకు ఏటా పంటలు దెబ్బతింటున్న పరిహారం అంద డం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఎండనక వాననక కష్టపడి పండించి చేతికొచ్చే సమయానికి పంటలు వర్షార్పణం అవుతున్నా యని,  ఐదేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.  పంటలు దెబ్బతినే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పర్యటించి ఆ తర్వాత మిన్న కుండి పోతున్నారనే విమర్శలు ఉన్నా యి.

ఎకరాకు 25వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పరిహారం అందించడంలో అధికారులు, ప్రభుత్వం ఏమేరా సఫలీకృతం అవుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

వేల ఎకరాల్లో.....

ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతి న్నాయి. అయితే అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో మాత్రం వందల ఎకరాలే చూపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో 283 మం ది రైతులకు చెందిన 55 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. 

పరిగి, దోమ, పూడూరు,దారూర్, తాండూర్ మండలాల్లో ఎక్కువ నష్టం జరిగింది. బొమ్ రాసి పెట్, బషీరాబాద్, యాలాల్, వికారాబాద్, నవాబుపేట్ మండలాల్లో కూడా నష్టం వాటిల్లింది.

పరిహారం ఎప్పుడు 

పంట నష్టపరిహారం అనేది రైతులకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది.  ఏటా పంటలు దెబ్బతింటున్న ప్రభుత్వం నుంచి పరిహారం మాత్రం అందడం లేదు. ఐదేళ్లుగా ఇదే తంతు సాగుతుందని అన్నదా తలు ఆరోపిస్తున్నారు. పంట నష్టపరిహారం అందకపోవడం పై రైతులు పలు అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో 1.5 లక్షల ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నాయి.

గత ఏడాది దెబ్బతిన్న 1500 ఎకరాలకు మాత్రమే పరిహారం అం దింది.  2023లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సాయం అందలేదు. ఇటీవల భారీ వర్షాలతో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయని తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

5 ఏళ్లలో దెబ్బతిన్న పంటల వివరాలు ఎకరాల్లో

2020      -1.25 లక్షలు

2021        -25000

2022        -6000 

2023        -3399 

2024        -1500

2025-    5000