calender_icon.png 21 August, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతల రోడ్లకు మరమ్మతులు చేయండి మహాప్రభో...

21-08-2025 12:28:08 AM

బూర్గంపాడు,ఆగస్టు20 (విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన సారపాక మసీద్ రోడ్డు గ్యాస్ గోడౌన్ సమీపంలో రహదారి గుంతలమయంగా మారిందని, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం నుంచి సారపాక వరకు ప్రధాన రహదారి బీటీ రోడ్డు సైతం గుంతలమయంగా మారి వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తక్షణమే గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సారపాకలో గుంతల రోడ్ల వద్ద నాయకులు బుధవారం ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనులు మాట్లాడుతూ రహదారులన్నీ గుంతలమయంగా మారి వాహనదారులు ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.

గుంతలు పడిన సమయంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో వర్షాలు పడితే చిత్తడిగా మారి నీళ్లు నిలిచి మళ్లీ రోడ్లు పాడవుతున్నాయని శాశ్వత పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులకు ప్రాణాపాయంగా మారినా ఆర్ అండ్ బి అధికారులు, ఎమ్మెల్యే మొద్దు నిద్ర వహిస్తున్నారన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎక్కడా మరమ్మతులకు గురికాలేదని, ఒకవేళ గుంతలు పడ్డా అప్పటి ఎమ్మెల్యే హయాంలో మరమ్మతులు తక్షణమే చేపట్టి వాహనదారులు, ప్రజల సమస్య తీర్చారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే. సంబంధిత శాఖ అధికారులు కళ్లుతెరిచి fc తక్షణమే గుంతలు పడిన రహదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైతే నిధులు మంజూరు చేసి కొత్తగా రోడ్లు వేయించాలని లేనిపక్షంలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తిరుపతి ఏసోబు, బెజ్జంకి కనకాచారి, యూత్ నాయకులు చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, పంగి సురేష్, కర్రి నాగేశ్వరరావు, భూక్యా కృష్ణ, బానోతు శ్రీను, గుల్ మహ్మద్, ఖాదర్, ఈశ్వరరావు, చట్టు ఆంజనేయులు, టిప్పు సుల్తాన్, దాసరి మోహనరావు, బండారు లక్ష్మీనారాయణ, ఆకుల పద్మ, అరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.