06-05-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి
హుస్నాబాద్, మే 5: సిద్దిపేట జిల్లా హు స్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి పొ న్నం ప్రభాకర్ సోమవారం లేఖ రాశారు. ఈ రహదారి విస్తరణతో ప్రాంతీయ అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు దో హదం చేస్తుందన్నారు.
ప్రస్తుతం ఉన్న 52 కిలోమీటర్ల మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు హుస్నాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల ను కలుపుతూ కీలకమైన రవాణా మార్గంగా ఉందని తెలిపారు. ఇది హైదరాబాద్-కరీంనగర్-రామగుండం (ఎస్ హెచ్-1), ఎల్కతుర్తి- సిద్దిపేట (ఎన్ హెచ్-765 డీజీ), జనగామ-ఎన్ హెచ్ డీ-36 జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఆరు మండల ప్రధాన కార్యాల యాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు జిల్లా కేంద్రాలకు కీలకమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తోందన్నారు.
ఈ రహదారి శ్రీరాంసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల కింద వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల గుండా వెళ్తుండడంతోపాటు, కొమరవెల్లి మల్లన్న దేవాలయం, కొలనుపాక జైన దేవాలయం, యాదగిరిగుట్ట నర్సింహస్వామి దేవాలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతుందన్నారు. కరీంనగర్ నుంచి జనగామకు ఇది అతి తక్కువ దూరం కలిగిన మార్గం కావడంతో అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో వివరించారు. ఈ రహదారి విస్తరణపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.