08-11-2025 05:24:20 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీ.సీ. సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఈ నెల 14న ఉదయం 6 గంటల నుంచి 15 ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు విధించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం షాపులన్ని మూసివేయాలని, జూబ్లీహిల్స్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబులు మూసివేయాలని సీపీ సూచించారు. రేపటి నుంచి ఎన్నిక కౌంటింగ్ ముగిసే వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలవుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని, ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.