08-11-2025 12:49:14 AM
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ఈ ఫెస్టివల్: దిల్ రాజు
అంతర్జాతీయ లఘుచిత్రాల వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ (హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ పేరుతో తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుంది. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో కొనసాగనున్న ఈ వేడుకలో భాగంగా నిర్వహించే పోటీలకు సంబంధించి ఎంట్రీలను పంపాల్సిన వెబ్‌సైట్ తాజాగా అందుబాటులోకి వచ్చింది.
ఈ వెబ్‌సైట్‌ను ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్ అధినేత ఉమామహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ.. “తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది.
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ షార్ట్‌ఫిలిం వేడుకలు ఐమాక్స్ థియేటర్‌లో జరుగుతాయి. ఫెస్టివల్ చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే ఏడాది నవంబర్ 14న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అన్నారు.
సమాచార శాఖ కమిషనర్, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. హైదరాబాద్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్‌కు అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల హాజరు అవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోటీల వివరాలు, వెబ్‌సైట్ గురించి వివరించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ అఫ్ ఫిలిం స్టడీస్ ప్రిన్సిపాల్, అంకురం సినిమా దర్శకుడు ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో గొప్ప సాంస్కృతిక విప్లవం ఉంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడి యా రంగాన్ని తెలంగాణ ఫోక్ సాంగ్స్ శాసిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో జ్యూరీ ఉంటుంద’ని ఆయన చెప్పారు.
అవార్డులు.. బహుమతులు:
మొదటి బహుమతి: రూ.100,000
రెండో బహుమతి: రూ.75,000
మూడో బహుమతి: రూ.50,000
ప్రోత్సాహక బహుమతి: రూ.20,000
ప్రోత్సాహక బహుమతి: రూ.20,000
జ్యూరీ స్పెషల్ మెన్షన్: రూ.10,000
జ్యూరీ స్పెషల్ మెన్షన్: రూ.10,000
ఇవేకాకుండా మరో పీపుల్స్ ఛాయిస్ అవార్డు ఇస్తారు. అవార్డులతోపాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఉంటాయి.
నిబంధనలు:
* గరిష్ఠ రన్‌టైమ్ 25 నిమిషాలు (క్రెడిట్‌లతో సహా). కనీస సమయ పరిమితి లేదు.
* జనవరి 1, 2023 తర్వాతి సినిమాలే పోటీకి పంపాలి.
* అన్ని చిత్రాలకు స్పష్టంగా ఇంగ్లీష్ ఉపశీర్షికలు ఉండాలి.
* దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌తో ప్రస్తుతం అనుబంధం ఉన్న వ్యక్తులు, విద్యార్థులు, అధ్యాపక సభ్యులు సహా ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హులు.
* అన్ని ఎంట్రీలను ఫిల్మ్‌ఫ్రీవే లేదా అధికారిక HISFF వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి.
* ప్రవేశ రుసుము రూ.500 ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ 2025, అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. చివరి రోజు నవంబర్ 20.
* విజేతల వివరాలను 2025, డిసెంబర్ 5 నాటికి ఈ మెయిల్, ఫిల్మ్‌ఫ్రీవే ద్వారా తెలియజేస్తారు.