30-01-2026 12:29:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో/ఖైరతాబాద్, జనవరి29 (విజయక్రాంతి) : నగరంలోని వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైడ్రా తన తనిఖీలను ముమ్మరం చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న షోరూమ్‌లపై హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్ చర్యలు చేపట్టారు. గురువారం జూబ్లీహిల్స్లోని ప్రముఖ వస్త్ర షోరూ మ్ నీరూస్‌తోపాటు నాంపల్లిలోని ఒక భారీ ఫర్నీచర్ షోరూమ్‌ను అధికారులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ షోరూమ్‌లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మూ డు సెల్లార్లు, నాలుగు అంతస్తులు కలిగిన ఈ భవనంపై అనుమతి లేకుండా రూఫ్ షెడ్డు వేసి, భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. అమ్మకాలు జరపాల్సిన చోట వస్త్రాల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్, గోదాములా మార్చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీ సం ఫైర్ ఎన్వోసీ లేకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు పనిచేయకపోవడం తో వెంటనే షోరూమ్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు.
విద్యుత్ అధికారులు పవర్ కట్ చేయగా, ఫైర్ అన్‌సేఫ్ షాప్ అని రాసి ఉన్న బోర్డులను అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని రహీమ్, మన్నన్ ఎస్టేట్‌కు చెందిన ఆరు అంతస్తుల స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణాన్ని తనిఖీ చేయ గా.. సెల్లార్ నుంచి పై అంతస్తు వరకు మెట్ల మార్గాన్ని కూడా వదలకుండా ఫర్నీచర్‌ను కుక్కేసినట్లు గుర్తించారు. ఎక్కడా ఫైర్ ఎన్వో సీ గానీ, అగ్నిమాపక పరికరాలు గానీ లేకపోవడంతో ఆ భవనానికి తాళం వేసి సీజ్ చేశారు. తనిఖీల్లో హైడ్రా, ఫైర్, జీహెచ్‌ఎంసీ ,విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.