calender_icon.png 27 July, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముష్కిన్ చెరువుపై హైడ్రా దృష్టి

26-07-2025 01:14:26 AM

ఎఫ్‌టీఎల్‌లో పోసిన మట్టిని తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వేసిన మట్టిని తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. ఆగస్టు నెలాఖరుకు ఎఫ్‌టీఎల్ పరిధి లో వేసిన మట్టితో పాటు, పైభాగంలో వేసిన బండ్‌ను తొలగించాలని, లేదంటే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

చెరువు ఎఫ్‌టీఎల్‌లో బండ్ నిర్మించి, పైభాగాన్ని చెరువు నుంచి బండ్ ద్వారా వేరు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా శుక్రవారం తన కార్యాలయంలో విచారణ చేపట్టింది. సిఎస్‌ఆర్ నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తున్న తత్వ రియల్ ఎస్టేట్ సంస్థతో పాటు, ఆ పనులు చేపట్టిన ద్రవాన్ష్ అనే ఎన్‌జీవో సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

చెరువు విస్తీర్ణం మొత్తం 50 ఎకరాల వరకూ ఉండగా, చెరువు చుట్టూ ఎగువ భాగంలో కూడా బండ్ నిర్మించడం తో కేవలం 12 ఎకరాలకు పరిమితం చేసినట్టు అవుతోందని నివాసితులు, ముష్కిన్ చెరువు పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రా ముందు వాపోయారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, అభివృద్ధి పనుల పేరు తో నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి పోయడం పట్ల హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే మట్టిని తొలగించి, పూర్తి స్థాయిలో చెరువును కాపాడి అభివృద్ధి పనులు కొనసాగించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.