calender_icon.png 21 January, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుచేయలే.. తగ్గేదేలే!

21-01-2026 12:46:10 AM

  1. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదు l అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే డ్రామా

రెవంత్ రెడ్డి బావమరిది భాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నాకు నోటీసులు

మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నం l కేసులకు బీఆర్‌ఎస్ భయపడదు

బొగ్గు స్కాంపై సీబీఐ విచారణ వేయాలి l మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): తాము తప్పు చేయలేదని, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలి పెట్టమని, ప్రజల కోసం తమ పోరాటం జరుపుతూనే ఉంటామని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు సక్సెస్ కావని, నీ కేసులకు బీఆర్‌ఎస్ భయపడదని పేర్కొన్నారు. రెవంత్ రెడ్డి బావమరిది భాగోతం పొద్దున బయటపెడితే సాయం త్రం తనకు నోటీసులిచ్చారని ఆరోపించారు.

మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా రేవంత్ రెడ్డి నిన్ను విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, తమకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా తాను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నాని, ధైర్యంగా వెళ్లి అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెబుతామన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు చెంపచెల్లు మనేలా ఇప్పటికే సమాధానం చెప్పిందని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టమని, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటామని సీఎంను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటాన్నారు. రెండేళ్లలో నువ్వు ఈ కేసులో చేసింది ఏముందని, ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతావని, ఇప్పటికే కాళేశ్వరం పేరుతో శ్వేతప త్రాలు అన్నవు, విచారణ అన్నవు, కమిషన్ అన్నవు. చిల్లర రాజకీయాలు బంద్ పెట్టాలన్నారు.

ప్రజలకు కావాల్సింది రైతు భరోసా, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారం... ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, తన మీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవని హెచ్చరించారు.  వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలకు దిమ్మదిరిగే విధంగా ప్రజలు జవాబు చెబుతారు చూస్కో రేవంత్‌రెడ్డి అని సవాల్ విసిరారు. 

వాటాల కోసం తన్నుకుంటున్నారు

తాటాకు చప్పుళ్లకు తాను బయట పడనని, నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదన్నారు. దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టానని చెప్పారు. సమైక్య రాష్ట్రం ఉద్యమంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయట పెట్టామని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావని విమర్శించారు.

అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీసినమని, పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్‌కు నోటీసులు, మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తరట...పట్టణాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తరట...మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నారని సీఎంను విమర్శించారు. సర్పంచు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయని, 40శాతం గెలిచి విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నారని, రెండేళ్ల నుంచి ఇదే డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.  

బొగ్గు స్కాంపై కిషన్‌రెడ్డికి లేఖ 

బొగ్గు స్కాంపై తాను కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నానని, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింది.. నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని  డిమాం డ్ చేశారు. రేవంత్‌రెడ్డి, తన బామ్మర్దితో కలిసి చేస్తున్న స్కాం ఎలా జరి గిందో విచారణ జరపాలన్నారు. నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీనిపై వెంటనే బీజే పీ స్పందించి దొంగలను అరెస్టు చే యాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. 

రేవంత్ షోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడడంలేదని ప్రశ్నించారు.  రా జకీయ డ్రామా ఇది, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తం ఎక్కడికైనా వెళ్తామన్నారు. మూడు రోజులు ముందే ప్లాన్ వేసి, దావోస్ నుంచి వచ్చే దాకా ఈ సీరియల్ నడవాలని అటెన్షన్ డైవర్షన్ లో భాగమని పేర్కొన్నారు.