21-01-2026 01:25:17 AM
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాలలో జనవరి 19, 20 వ తేదీలలో ‘నావిగేటింగ్ కంప్లెక్సీటిస్ ఇన్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ త్రో వికసిత్ భారత్ 2047‘ అనే అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సు మొదటి రోజు ప్రత్యక్ష పద్ధతిలో, రెండవ రోజు అంతర్జాల మాధ్యమం ద్వారా సదస్సును నిర్వహించారు. సభాధ్యక్షులు, కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఒక సరికొత్త అంశంతో అధ్యాపకులలో పరిశోధన పట్ల జిజ్ఞాస కలిగిస్తూ సదస్సులు నిర్వహించడం ఐ ఐ ఎం సి కే చెందుతుందని, ప్రతి పరిశోధకుని ఆలోచనా విధానం మార్పుకు నాంది కావాలని తెలియజేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఆచార్య పాట్రిక్ మాట్లాడుతూ వాణిజ్య శాస్త్ర అంశాలలో సదస్సులు, ప్రాజెక్టు వర్క్‌పై వర్క్‌షాప్, కామర్స్ టాలెంట్ టెస్ట్ ఇలా ఏది నిర్వహించాలన్నా ఐ ఐ ఎం సి కళాశాల ముందుంటుందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగ ఆచార్యులు చేతన్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యా విధానము అనుసరించడం ద్వారా దానికి సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులువు అయితుందన్నారు. అనంతరం ఐఎస్‌బీఎన్ నంబర్‌తో కూడిన 75 వ్యాస సంగ్రహాలతో పొందుపర్చిన సంకలనాన్ని (సావనీర్) ఆవిష్కరించారు.
రెండవ రోజు జరిగిన సదస్సులో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు సొల్యూషన్స్, జీ ఈ ఏ నార్త్ అమెరికా ఉపాధ్యక్షులు డా.రామ్ కుమార్ మాట్లాడుతూ.. మానవులలోని నైపుణ్యాలని కృత్రిమ మేథతో అనుసంధానం చేయడం ద్వారా, సుస్థిరాభివృద్ధి సాధిస్తూ వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. ఈ రెండు రోజులలో 126 మంది పరిశోధకులు 47 పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలనుండే కాక, ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి కూడా పరిశోధకులు తమ వ్యాసాల ద్వారా వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
సదస్సు ముగింపు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలలో వివిధ విభాగాల నుండి ఉత్తమ పరిశోధనా పత్రాలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఆయా స్థానాలలో నిలిచిన ప్రతి విభాగం వారికి వరుసగా నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ రెండు రోజుల సదస్సులో సదస్సు సంచాలకులు, వాణిజ్య శాస్త్ర సహాయ అధ్యాపకురాలు సముద్రాల శ్రావణి, కామర్స్, మేనేజ్మెంట్ ప్రొ. సత్యనారాయణ మూర్తి, ప్రొ. సుధాకర్, డా. రామకృష్ణ, డా. సీమా నజనీన్, తిరునగరి శరత్ చంద్ర, డీన్లు డా డి.తిరుమలరావు, డా. జి. సంతోషి, సదస్సు సహా సంచాలకురాలు లైబ్రేరియన్ డా. జి. రమాదేవి పాల్గొన్నారు.