calender_icon.png 27 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త, బిడ్డను కోల్పోయా.. న్యాయం చేయండి

27-08-2025 12:20:28 AM

 చేవెళ్లలో రోడ్డు ప్రమాద బాధితురాలు, బంధువుల ధర్నా 

ఆదుకుంటామని హామీ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్

చేవెళ్ల, ఆగస్టు 26: సంపాదించే భర్తను, ఆప్యాయంగా పెంచుకున్న కూతురును కోల్పోయాను.. తనకు న్యాయం చేయాలని రోడ్డు ప్రమాద బాధితురాలు డిమాండ్ చేశారు. సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో చనిపోయిన వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన తండ్రీకూతురు తాండ్ర రవీందర్ (32), తాండ్ర కృప(13) కుటుంబసభ్యులు, గ్రామస్తులు మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట బీజాపూర్ హైవేపై ధర్నాకు దిగారు.  ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

దాదాపు 3 గంటల పాటు బైఠాయించడంతో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.  దీంతో సీఐ భూపాల్ శ్రీధర్ జోక్యం చేసుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు.  ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ..  భర్త, కూతురును కోల్పోయి రోడ్డున పడ్డానని, ఇంకెవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. 

లేదంటే తననూ లారీ ఎక్కించి చంపాలని తేల్చిచెప్పారు.  రూ. కోటి నష్ట పరిహారంతో పాటు తాను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎఎన్ ఎం ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.  తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  అయితే రాత పూర్వకంగా ఇస్తేనే ఇక్కడి నుంచి లేస్తానని చెప్పడంతో సీఐ ఆమెకు హామీ పత్రాన్ని రాసిచ్చి ధర్నా విరమింపజేశారు.