30-12-2025 12:00:00 AM
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘రాజాసాబ్’. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధిఅగర్వాల్, రిద్ధికుమార్ హీరోయి న్లుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ 2.oను మేకర్స్ రిలీజ్ చేశారు. అన్నీ మర్చిపోయే గంగమ్మ (జరీనా వాహబ్) తన భర్త (సంజయ్ దత్)ను మర్చిపోలేకపోతుంది.
ఆమె మనవడు రాజాసాబ్ (ప్రభాస్) ఓ మిస్టరీగా మారిన తాతను కలుసుకునే లక్ష్యంతో సాహస ప్రయాణానికి సిద్ధమవుతాడు. హిప్నాటిజంతోపాటు దుష్ట శక్తులను శాసించగల తాత.. తన హవేలీలోకి వెళ్లిన రాజాసాబ్‌ను, అతని వెంట ఉన్నవారిని ఎలా ఇబ్బందిపెట్టాడు? చివరకు రాజాసాబ్ తన మిషన్‌ను పూర్తి చేసుకున్నాడా.. లేదా? అసలు దేవనగర సంస్థాన జమీందారిణి గంగాదేవి.. సాధారణ మధ్యతరగతి గంగమ్మగా ఎందుకు జీవిస్తోంది? అనే సందేహాలు రేకెత్తించే అంశాలతో రూపొందిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
‘మన టైమ్ స్టార్ట్ అయింది, లవ్‌యూ’.. ‘నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది బాగా’.. ‘నిన్ను చాలా మిస్ అవుతున్నా..’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుం టున్నాయి. ‘మిస్ యూ టూ రాజాసాబ్’.., ‘ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే’.. అంటూ సంజయ్ దత్ భయపెట్టేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్.