calender_icon.png 30 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖుదీరాం బోస్.. సిసలైన భారతీయ కథ!

30-12-2025 12:00:00 AM

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేశ్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

* నిజం చెప్పాలంటే, కథ వింటున్నంత సేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ఒక బాలుడు దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీరుడి పాత్ర పోషించబోతున్నానని తెలియగానే ఒక పక్క గర్వంగా, మరోపక్క పెద్ద బాధ్యతగా అనిపించింది. 

* నా మొదటి సినిమాకే పద్మశ్రీ తోట తరణి, మణిశర్మ, రసూల్ ఎల్లోర్ వంటి దిగ్గజాలతో పనిచేయడం నా అదృష్టం. అతుల్ కులకర్ణి, వివేక్ ఓబెరాయ్, నాజర్ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం నాకొక పాఠశాలలా అనిపించింది.  

* ఈ చిత్ర నిర్మాత విజయ్ జాగర్లమూడి మా నాన్నే. ఒక రకంగా ఈ పాత్ర నాకు సులభంగానే దక్కినప్పటికీ, దానికి న్యాయం చేయడం కోసం నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. మా నాన్నకు దేశభక్తి ఎక్కువ. ఆయన విపరీతంగా పుస్తకాలు, గ్రంథాలు చదువుతారు. మా ఇంట్లో ఎటుచూసినా దేశభక్తి సాహిత్యమే ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే, నేటితరానికి ఈ కథ చెప్తున్నారు.

* ఈ పాత్ర కోసం నేను దాదాపు 90 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నా. సీనియర్ నటుడు ఉత్తేజ్ దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నా. ఆయన భార్య పద్మ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. చారిత్రక పుస్తకాలు చదివి, ఆ కాలం నాటి బాడీ లాంగ్వేజ్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా.

* ఈ చిత్రంలో అత్యంత కష్టమైన, భావోద్వేగపూరితమైన సీన్స్ ఉన్నాయి. 18 ఏళ్ల వయసులో మరణం కళ్ల ముందున్నా, దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడం సామాన్య విషయం కాదు. ఉరికంబం సీన్ చేస్తున్న ప్పుడు కలిగిన భావం నాలో చాలా రోజుల వరకు ఉండిపోయింది. నాలో భయం పోయి, సత్యం కోసం నిలబడాలనే ధైర్యం పెరిగింది.

* ‘వందేమాతరం’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన యువ వీరుడు ఖుదీరాం. వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదితతో ఆయనకున్న అనుబంధం, ఆమె తయారుచేసిన తొలి భారతీయ జెండాను ఆయన ప్రజల మధ్యకు తీసుకెళ్లడం వంటి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది.

* ఈ సినిమాను పార్లమెంట్‌లో ఎంపీల కోసం స్క్రీనింగ్ వేసినప్పుడు చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో సినిమా అయిపోయాక 5 నిమి షాల పాటు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇది కదా నిజమైన ఇండియన్ స్టోరీ అని వారు మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా అనిపించింది. 

* దేశభక్తి అనేది మాటల్లో కాదు, మనం చేసే పనిలో ఉండాలి. ‘ఖుదీరాం బోస్’ లాంటి సినిమాలు వంద కొకటి వస్తాయి. మన చరిత్రను, వీరుల త్యాగాలను గౌరవించడం మన బాధ్యత. ఇదే నేను ప్రేక్షకులకు ఇచ్చే సందేశం. 

* భవిష్యత్తులో ’ఛత్రపతి శివాజీ’ వంటి వీరగాథల్లో నటించాలని కోరుకుంటున్నా. ‘ఖుదీరాం బోస్’ చిత్రాన్ని భారత ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారం ‘వేవ్స్’ (Waves)లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుంచి వేవ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉచితంగా చూడవచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. దయచేసి అందరూ చూసి మన చరిత్రను ఆదరించండి.