calender_icon.png 12 November, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత జన్మల సినిమాలంటే నాకు చాలా ఇష్టం

12-11-2025 12:33:11 AM

ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’. ఈ చిత్రాన్ని సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. “నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్న సినిమా ‘మూగమనసులు’తో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో ‘జానకి రాముడు’ చేశాను. రెండూ చాలా సూపర్ హిట్ అయ్యాయి. గత జన్మలు మన సంస్కృతిలో ఉండిపోయిన ఒక కథ. ‘గత వైభవం’ నాలుగు జనరేషన్ల కథ. ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్‌” అన్నారు.

చిత్ర కథానాయకుడు దుష్యంత్ మాట్లాడుతూ.. “నాగార్జున ఐకానిక్ సినిమా శివ నవంబర్ 14న రీరిలీజ్ అవుతోంది. అదే రోజు వస్తున్న మా సినిమాను ప్రమోట్ చేయడానికి నాగార్జున రావడమనేది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన ప్రోత్సాహం నా అదృష్టంగా భావిస్తున్నా” అని తెలిపారు. కథానాయకి ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం.

నాగార్జున ఎప్పుడు కొత్త కాంటెంట్, కథలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనకు టీజర్ ట్రైలర్ చాలా నచ్చాయి. ఆయన లాంటి స్టార్ మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు. “గత వైభవం’. అంటే ఒక సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఆ సామ్రాజ్యానికి రాజులా నాగార్జున ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న ప్రయోగాత్మక చిత్రమిది” అని డైరెక్టర్ సింపుల్ సుని అన్నారు. నిర్మాత చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. “టీజర్ చూడగానే మన సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి వైబ్ వచ్చింది.

ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఇలాంటి ఫాంటసీ సినిమా రాలేదు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు. “తప్పకుండా గత వైభవం సినిమా అందరికి ఒక మంచి అనుభూతినిస్తుంది. ముందు శివ చూడండి. తర్వాత గత వైభవం చూడండి” నిర్మాత దీపక్ అన్నారు. డీవోపీ విలియం డేవిడ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.