14-08-2025 12:00:00 AM
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘పరదా’. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకే మద్దతు ఇస్తున్నారు. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం కథానాయిక అనుపమ వినూత్నంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ చెప్పిన మాటలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ అనుపమ ఏం చెప్పిందంటే.. “పరదా’ సినిమాలో నటించడం అంత సులువేమీ కాదు.
ఈ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ఎక్కువ మందికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలా వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా కొత్తగా ప్రమోషన్స్ చేయడం నాకు చాలా ఇష్టం కూడా. సినిమా టైటిల్ ‘పరదా’ కాబట్టి.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పరదా వేసుకొని పాల్గొన్నా. అందరిలాగే ఫ్రీ బర్డ్‌లాగా చార్మినార్ చుట్టూ తిరిగి చక్కర్లు కొట్టాలని నాకూ ఉంటుంది.
అయితే ఇప్పుడు నా కోరిక తీర్చుకోబోతున్నా. పరదా వేసుకొని చార్మినార్‌ను పూర్తిగా చుట్టేస్తా. పరదా వేసుకొని సినిమా ప్రమోషన్స్ చేస్తా” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాలా మంది నెటిజన్లు.. ‘అబ్బాయిలూ.. సిద్ధంగా ఉండండిరో.. మీ ఫేవరెట్ హీరోయిన్ పరదా వేసుకొని చార్మినార్ దగ్గరికి రాబోతోంది. మీ అదృష్టం బాగుంటే ఆమె మీకు ఎదురుపడొచ్చు. పరదా వేసుకొస్తున్నవాళ్లను కాస్త కనిపెట్టుకొని ఉండండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.