calender_icon.png 30 January, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఏడీఎంకేలోకి నేనొస్తా!

30-01-2026 12:00:00 AM

  1. ఈపీఎస్‌ను కోరిన తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్
  2. అసెంబ్లీ ఎన్నికల వేళ చాన్స్‌లేదన్న పళనిస్వామి

చెన్నై, జనవరి 29: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఏఐఏడీఎంకే పార్టీలోకి ‘నేనొస్తా.. పెద్దన్నయ్యా అంటూ ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్)ను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) కోరారు. డీఎంకేపై ఐక్య పోరాటానికి ఏఐఏడీఎంకేలోని వర్గాలన్నీ ఏకం కావాలని హితవు పలికాడు. అయితే పార్టీలోకి రావడానికి ఎటువంటి అవకాశం లేదని పళనిస్వామి తేల్చిచెప్పారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఓపీఎస్ ఎన్డీయేలో చేరుతారని టీటీవీ దినకరణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై ఐక్య పోరాటం చేయడానికి ఏఐఏడీఎంకేలోని చీలిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో తమిళనాడులో ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతా చర్చనీయాంశమవుతోంది.

ఒకప్పుడు దివంగత దిగ్గజం జే జయలలితకు అత్యంత విశ్వసనీయ సహాయకుడిగా ఉన్న, 2022లో పార్టీ నుంచి బహిష్కరించబడిన, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్), ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) నేతృత్వం లోని ఏఐఏడీఎంకే పార్టీలోకి తిరిగి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది తమిళనాడు ఎన్నికలకు ముందు ఓపీఎస్ పార్టీలోకి తిరిగి రావడానికి ఎలాంటి అవ కాశాలూ లేవని ఈపీఎస్ ఖరాకండిగా చెప్పా రు.

తమిళనాడులోని తేనిలో జరిగిన ఒక సమావేశంలో ఈపీఎస్‌ను ‘పెద్దన్నయ్య’ అని ఓపీఎస్ సంబోధిస్తూ ఏఐఏడీఎంకేలోని అన్ని వర్గాలు ఏకం కావాలని చెప్పారు. ‘నా పొత్తు వైఖరిపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏఐఏడీఎంకేలో మా హక్కుల కోసం మా చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తా. నేను ఏఐఏడీఎంకేలో చేరడానికి సిద్ధంగా ఉన్నా.

టీటీవీ దినకరన్ నన్ను స్వాగతించడానికి సిద్ధం గా ఉన్నారు. ఈపీఎస్ సిద్ధంగా ఉన్నారా?’ అని ఓపీఎస్ గురువారం సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై ఐక్య పోరాటం చేయడానికి ఏఐఏడీఎంకేలోని చీలిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.