26-09-2025 12:15:58 AM
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ తన పేరు ప్రస్తావించటంపై అగ్ర నటుడు చిరంజీవి స్పందించారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కామినేని మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ మొత్తం సీఎం జగన్‌ను కలవడానికి వెళ్తే మొదట ఆయన అందుబాటులోకి రాలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పా రు. చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ వచ్చారు’ అని చెప్పారు.
అదే సభలో ఉన్న బాలకృష్ణ స్పందిస్తూ ‘చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ దిగి వచ్చారన్నది అబద్ధం. అవమానం జరిగింది మాత్రం నిజం’ అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మాటలపై మెగాస్టార్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన పరిస్థితు లను వివరించారు. “చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదక్కడ” అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. అప్పుడు కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు..
సినిమా టికెట్ల ధరల పెంపు విషయమై ప్రభుత్వంతో మాట్లాడేందుకు చొరవ తీసుకోవాలని నన్ను కోరారు. నేను అప్పటి సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్‌లో మాట్లాడాను. ఆ తర్వాత ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి ‘సీఎం లంచ్‌కి రమ్మన్నారు’ అని డేట్ ఇచ్చారు. అప్పుడు భోజనం చేస్తూనే సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించాను. ఇండస్ట్రీకి, మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుం టున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని కూడా చెప్పాను. కొన్నిరోజులకు మంత్రి నాని ఫోన్ చేసి కొవిడ్ ఉన్నందున ఐదుగురే రావాలని చెప్పారు.
నేను ఓ పది మంది వస్తామని చెప్తే ఒప్పుకున్నారు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దాంతో మరికొంతమందిమి సీఎంను కలిశాం. పరిశ్రమకు సహకారం అందించాలని కోరాను. నేను చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది. మీ ‘వీరసింహారెడ్డి’, ‘నా వాల్తేరు వీరయ్య’ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే వీలు కలిగింది. నేను ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ ధోరణిలోనే మాట్లాడతాను” అని పేర్కొన్నారు.