23-12-2025 02:17:56 AM
ఘట్ కేసర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయంలో నెకస్ట్ జనరేషన్ మెటీరియల్స్ పై సోమవారం అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. అనురాగ్ విశ్వవిద్యాలయం యొక్క భౌతిక శాస్త్ర విభాగం ఈనెల 22 నుండి 23 వరకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నెకస్ట్ జనరేషన్ ఎమర్జింగ్ మెటీరియల్స్ ఐకాన్ జెమ్ - 2025 పై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ సమస్యలకు సంబంధించిన ప్రస్తుత సమస్యలను పరిష్కరించగల కొత్త పదార్థాలపై ఈసమావేశం దృష్టి సారించింది.
ఈ ఐకాన్ జెమ్-2025 కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. జగదీశ్వరరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరై తన ద్రుక్కోణాలను ఆవిష్కరించారు. అలాగే ఈసదస్సుకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టాటా నరసింగరావును గౌరవ అతిథిగా ఆహ్వానించారు. వారిద్దరూ సదస్సు ఇతివృత్తాన్ని ప్రస్తుత అవసరాలు, పరిశోధనలు, ఆచరణాత్మకత మధ్య అంతరాలను అనుసంధానించారు. విద్యార్థులు, పరిశోధకులు లోతైన అభ్యాసాన్ని అభ్యసించడానికి వ్యూహాలను అమలు చేయాలని సూచించారు.
ఆవిష్కరణల ద్వారా నిజమైన మేక్-ఇన్-ఇండియా సాంకేతికతలకు దారితీసే ఒక రోడ్ మ్యాప్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఐకాన్ జెమ్-2025 లో భారతదేశం, విదేశాల నుండి పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ వ్యక్తులు సహా దాదాపు 180 మంది పాల్గొన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయ యాజమాన్యం అందించిన కీలకమైన సహాయానికి సమావేశ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి అనురాగ్ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ ముత్తారెడ్డి, ప్రొఫెసర్ వి. విజయకుమార్, డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ కె. ఎస్. చలపతి, హెచ్‌ఓడి లు అధ్యాపకులు హాజరవుతున్నారు.