14-05-2025 09:03:53 PM
చండూరు పోలీస్ డివిజన్ ఏర్పాటు, గట్టుప్పల్ పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ అథారిటీ కల్పించాలి..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నెలకొని ఉన్న కరెంటు సమస్యలను గుర్తించి నివేదిక ఇవ్వాలని స్థానిక ముఖ్య నాయకులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ఆదేశించారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని వున్న కరెంటు సమస్యలు తీర్చాలని కోరారు. తక్షణమే మండల కేంద్రాలలో ఉన్న కరెంటు ఇబ్బందులను వెంటనే గుర్తించి నివేదిక ఇవ్వాలని వెను వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మునుగోడు టౌన్ నుండి దుబ్బకాలువకు వెళ్లే రోడ్డు పూర్తికాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పంచాయతీరాజ్ డిఇ, ఈఈ లతో మాట్లాడి వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అథారిటీ ఇంకా రాలేదని గట్టుపల్ కు చెందిన నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డిజిపి జితేందర్ ఫోన్లో మాట్లాడి గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ ని పూర్తిస్థాయిలో ఎఫ్ఐఆర్ అథారిటీ కల్పించాలని, చండూరు రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ ఇంకా పోలీసు డివిజన్ కాలేదని పోలీస్ డివిజన్ ఏర్పాటుచేసి డీఎస్పీ పోస్టును మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డిజిపి నివేదిక తెప్పించుకొని పరిశీలించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచులు జాల వెంకటేశ్వర్లు, తాటికొండ సైదులు, మాధగోని రాజేష్ గౌడ్, పందుల భాస్కర్, పాల్వాయి జితేందర్ రెడ్డి, జంగిలి నాగరాజు అన్వర్, ముఖ్య నాయకులు ఉన్నారు.