calender_icon.png 27 August, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

27-08-2025 02:32:04 AM

-దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం?

-కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

కరీంనగర్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వెంటనే దొంగ ఓట్లను తొలగించి, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దీనికి కాంగ్రెస్ సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్ని కల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో తనను కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే దొంగ ఓట్లంటూ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ 20 నెలల పాలనలో పంచాయతీలకు నయాపైసా ఇవ్వలేదన్నారు. పంచాయతీలకు నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారే తప్ప ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని విమర్శిం చారు. పీసీసీ అధ్యక్షుడు ఒక్కసారి కూడా వార్డు మెంబర్‌గా గెలవలేదని, ఆ వ్యక్తికి ఓట్ల చొరీ సంగతి ఏం తెలుసని ప్రశ్నించారు. మహేశ్‌గౌడ్‌ను చూస్తే గజిని సినిమా గుర్తుకొస్తుందని.. ఆయనే తనను బీసీ అన్నడు, బీసీ కాబట్టే బీజేపీ రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మాట్లాడిండు, ఇప్పుడు మళ్లీ ఆయనే దేశ్‌ముఖ్ అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

కరీంనగర్‌లో చాలా మంది మైనారిటీ ఇండ్లలో వందల కొద్ది దొంగ ఓట్లున్నాయని, వాటిని తొలగించాలని మాజీ మేయర్ సునీల్‌రావు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఆ దొంగ ఓట్లు వేసుకున్నా కాంగ్రెస్ గెలవలేదన్నారు. దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే 8 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ ఎందుకు గెలుస్తుందని ప్రశ్నించారు. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ఫ్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది అని నిలదీశారు.

తాను దొంగ ఓట్లతో గెలిచి ఉంటే ఎన్నికలైపోయిన వెంటనే ఎలక్షన్ కమిషన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక అక్రమ వలసను నిరోధించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మిస్తోందని, లా అండ్ ఆర్డర్ రాష్ర్ట ప్రభుత్వాల పరిధిలో ఉంటోందని, రోహింగ్యాలను పంపాలని చెబుతుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. పాస్ పోర్టు, వీసా గడువు ముగిసిన తరువాత విదేశీయులందరినీ వాళ్ల దేశాలకు పంపిస్తున్నామని తెలిపారు.