calender_icon.png 27 August, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది

27-08-2025 02:33:42 AM

- ముంతాజ్ హోటల్‌కు మీరు భూములిచ్చి మమ్మల్ని అంటారా?

- మాపై బురద చల్లుతారా?

- భూమనకు తిరుపతిలో ఉండే అర్హత లేదు

- టీటీటీ చైర్మన్ బీఆర్ నాయుడు

- మీడియా సమావేశంలో జగన్‌పై మండిపడిన టీటీడీ చైర్మన్

 తిరుపతి, ఆగస్టు 26(విజయక్రాంతి)ః  తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు భూముల కేటాయింపు వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముంతాజ్ భూముల వ్యవహారంపై పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఖండించారు.

ఆ హోటల్ కోసం ఓబెరాయ్ గ్రూప్‌నకు భూముల కేటాయింపును తప్పుబడుతూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ  భూమన, ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలపై వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు.

ఏడు కొండలను ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్‌కు కేటాయించడం వైసీపీ చేసిన తప్పు అని అన్నారు.ఆ భూమి ఏడుకొండల్లోని భాగమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనపై ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. ఆ భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని నిర్ణయించామని, ఈ విషయంపై ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు చర్చించారన్నారు.

ఇంకా పేపర్ వర్క్ జరుగుతోందని, భూమి హ్యాండోవర్ చేయలేదని బీఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్‌కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా అని వైసీపీని ప్రశ్నించారు. అది పవిత్ర స్థలమని, ఒక్క అంగుళం కూడా పొనివ్వమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు మాట్లాడుతున్నారన్నారు. ముంతాజ్ హోటల్‌కు ఆ భూమిని మీరెందుకిచ్చారో ముందు సమాధానం చెప్పాలన్నారు.

వైసీపీకి ఈ అంశంపై సీబీఐ విచారణ కొరే అర్హత లేదని, తప్పు చేశామని లెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలన్నారు.ఈ పాలక మండలి వచ్చినప్పటి నుంచి నీతి నిజాయితీతో పనిచేస్తోందని, తిరుమల పవిత్రత కాపాడే ఉద్ధేశ్యంతోనే మేము పనిచేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమలపై ప్రతిరోజు బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, అందరు మీలా దొంగలు ఉండరన్నారు.ఆ ౨౫ ఎరాలు మీరు ఊరికే ఇవ్వలేదని, ఎం జరిగిందో తమకు తెలుసన్నారు. అజయ్‌కుమార్‌ను స్వయంగా జగన్ పాయింట్ బ్లాంక్‌లో బెదిరించి ఆ ఎకరాలను వెనక్కుతీసుకున్నారన్నారు. వైసీపీ నేత భూమన తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదని, ఆయన్ని తిరుపతి నుంచి తరిమికొట్టాలన్నారు.