27-08-2025 02:30:48 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న వందలాది మందిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ఉధృతం చేసింది. ఇప్పటికే సంస్థ చైర్మన్ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ సండు పూర్ణచందర్‌రావును మంగళవారం అరెస్ట్ చేశారు. చైర్మన్‌తో కలిసి వందల కోట్ల రూపాయల మోసానికి పూర్ణచందర్‌రావు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో, ఆకర్షణీయమైన ఆఫర్లతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుని, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వసూలు చేసిన నిధులను పక్కదారి పట్టించారనేది ప్రధాన ఆరోపణ. సాహితీ ఇన్ఫ్రాతో పాటు లక్ష్మీనారాయణకు మరో 32 అనుబంధ కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన నిధులను దారి మళ్లించి, లెక్కలు చూపకుండా మోసాలకు పాల్పడినట్లు ఈడీ బలంగా అనుమానిస్తోంది. పూర్ణచందర్‌రావు అరెస్ట్‌తో ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి కోరనున్నారు.