09-01-2026 12:00:00 AM
‘ఆ రోజు అక్కడ జరిగింది నిజంగా ఓ దురదృష్టకరమైన సంఘటన. దాని గురించి నేను చాలా మాట్లాడాలి..’ అంటూ ఇటీవల ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’లో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌తోపాటు నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తనపైకి అభిమానులు ఎగబడటంతో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.
ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో తనను అభిమానులు చుట్టుముట్టిన సందర్భాన్ని దురదృష్టకరమైన సంఘటన అని నిధి అభిప్రాయపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయమై స్పందిస్తూ.. “ఆ రోజు అక్కడ జరిగింది నిజంగా ఓ దురదృష్టకరమైన సంఘటన. దాని గురించి నేను చాలా మాట్లాడాలి. కానీ, సరైన సమయంలో మాట్లాడతా. అదొక సున్నితమైన విషయం. పొరపాటున నేనేదైనా మాట్లాడితే, అది మరో విధమైన సంకేతాలకు దారి తీయొచ్చు.
తద్వారా అందరికీ అవకాశం ఇచ్చిన దాన్ని అవుతాను. కానీ, కచ్చితంగా మాట్లాడతా. అందుకు కొంత సమయం కావాలి” అని పేర్కొంది. ఇక తన నుంచి రాబోయే సినిమాల గురించి చెప్తూ.. “రాజాసాబ్’ విడుదల తర్వాత నా అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్తా. తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నా. ఇతర భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేశా. ఈ 2026 ఏడాదంతా నేను ఫుల్ బిజీ. 2025లో రెండు ప్రత్యేక అనుభవాలున్నాయి.
‘రాజాసాబ్’ షూటింగ్, ‘హరి హర వీరమల్లు’ ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ నన్ను ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఓటీటీ సినిమాలంటే ఇష్టం. నేరుగా ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి కూడా నేను రెడీ. మంచి కథ ఉంటే కచ్చితంగా చేస్తా” అని నిధి తెలిపింది.