calender_icon.png 10 September, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పుకోవాలంటే..

07-09-2025 12:00:00 AM

సిత్రమైన ప్రమోషన్లు తప్పవా?!

* మా సినిమా చూసి మంచి రివ్యూ ఇస్తే హీరోతో స్టార్ హోటల్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తామంటారొకరు. మా మూవీ టికెట్ కొంటే లక్కీడ్రా ద్వారా బైక్ గిఫ్ట్ పొందవచ్చని చెప్తుంది మరో మూవీ టీమ్. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ, బూతు ధ్వనించేలా టైటిల్స్ పెట్టడాలూ.. తమ సినిమా చూడ్డానికి ఎవరూ రావట్లేదని చెప్పుతో కొట్టుకోవడం వంటి సంఘటనలు భాషాభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. తమ సినిమాను ఎలాగైనా జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజలు ఎలాగైనా తమ సినిమా గురించి ‘చెప్పు’కునేలా చేయాల యావలో మేకర్స్ వ్యవహరిస్తున్న తీరు వెగటు పుట్టిస్తున్నాయి. 

 నరేశ్ ఆరుట్ల

గత నెల (ఆగస్టు) 29న థియేటర్లలో ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమా విడుదలైంది. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్‌పాల్‌రెడ్డి అడిదల నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. అయితే, ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్‌కు ఎవరూ తమ సినిమా చూసేందుకు రాలేదంటూ దర్శకుడు శ్రీవత్స చెప్పుతో కొట్టుకొని అందరినీ విస్మయానికి గురిచేశారు. ఇండస్ట్రీలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. 

మరోవైపు ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ చేసిన ఓ పని కూడా ఇలాగే తెలుగు వారు నొచ్చుకున్నారు. ఈ నెల 8వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఓ కొత్త సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు విజయ్ ఆంటోనీ. ఇందుకు సంబంధించి పోస్టర్లను ఎంతో అందంగా రూపొందించారు. ఎంచక్కా తెలుగు ఫాంట్‌లోనూ ఆ సినిమా టైటిల్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత నోరెళ్లబెట్టడమే సినీప్రియుల వంతయ్యింది.

భాషాభిమానులకు కారణమైంది. నెట్టింట ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఒక భాషలోని సినిమా పేరును మరో భాషలోకి అనువదించేటప్పుడు ఎలాంటి అర్థం వస్తుందోనని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అంటూ చిన్నపాటి పోరాటమే సాగింది. ఇలా తీవ్రస్థాయిలో విమర్శలు రావటంతో టీమ్ తోక ముడిచింది. చివరకు ఆ సినిమా టైటిల్‌ను ‘బూకి’గా మార్చారు. అయినా సినీప్రియులకు వచ్చిన ధర్మ సందేహం ఇంకా తీరలేదు. ప్రస్తుతం మార్చిన సినిమా పేరులోని మొదటి అక్షరం ‘బూ’ ఉన్నచోట ‘పూ’ అనే అక్షరం ఉండేది. ఇప్పుడు ‘బూకి’గా పేరు మార్చినా, దీనికి తెలుగులో అర్థమేమిటో నంటూ తెలుసుకునే పనిలో పడ్డారంతా! 

ఏదేమైనా తమ సినిమాను ఎలాగోలా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చోటుచేసుకున్న రెండు తాజా సంఘటనలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా తీయడం కాదని, చూసేలా సినిమా తీయాలని చురక అంటిస్తున్నారు. ఇది తెలియకనే దర్శకుడు మోహన్ శ్రీవత్స తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు.

రెండున్నరేళ్లు కష్టపడి సినిమా తీసి, పాన్‌ఇండియాగా రిలీజ్ చేస్తే థియేటర్లలో పట్టుమని పది మంది కూడా లేరంటూ దర్శకుడు వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ డైరెక్టర్‌ది అమాయకత్వమో.. ఇంకేదో తెలియదు కానీ, డైరెక్టర్ తీరును చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదంటూ స్పందించినవారే ఎక్కువ. సినిమా ఒక్కటే వినోద మార్గం అయినప్పుడు రెండున్నర గంటల వినోదం కోసం థియేటర్‌ను వెతుక్కుంటూ వెళ్లేవాడు సగటు ప్రేక్షకుడు.

సినిమా ఎంత బాగా లేకున్నా చూసేవాళ్లు. ఇప్పుడు వినోదం కోసం ప్రత్యేకంగా థియేటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండాపోయింది. టీవీ రూపంలో ఇంట్లో, ఓటీటీ రూపంలో ఫోన్‌లోనే కావాల్సినంత వినోదం అందుబాటులో ఉంటోంది. వీటిని దాటుకొని, ఇంటి గడప దాటి ప్రేక్షకుడు థియేటర్ మెట్లు ఎక్కాలంటే మేకర్స్ ఏదో జిమ్మిక్కులు చేస్తే తప్ప సాధ్యం కాదు! ట్రెండ్‌ను కాదని సినిమాను తీసుకొచ్చినా దెబ్బడిపోవటం ఖాయం.

ఎటూ ఇప్పుడు పురాణాల్ని అంశాల్ని మిక్స్ చేసే సినిమాలు వస్తున్నాయని సినిమా తీసేస్తే కుదరదు. ప్రస్తుత రోజుల్లో ఓటీటీలో దొరకని జానర్ సినిమా లేదు. కాబట్టి అంతకుమించి తీయగలిగితే తప్ప ప్రేక్షకుల్ని రప్పించటం కష్టం. స్టార్‌డమ్, రక్తికట్టించే కథాకథనాలు, ఉత్కంఠను రేకెత్తించే స్క్రీన్‌ప్లే ఇలా.. ఎన్నో బేరీజు వేసుకొని మరీ సినిమాను పట్టాలెక్కించక తప్పని పరిస్థితి. టికెట్ ధరలు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అన్నీ కలిసి ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటేనే జంకుతున్నారు.

ఇవన్నీ ఏమీ లేకుండా తమకు తట్టిన ఒక్క పాయింట్‌ను పట్టుకొని, దాని చుట్టూ కథ అల్లుకొని నిర్మాణా నంతర కార్యక్రమాలకు సమయం కేటాయించి, సినిమాను జనంలోకి వదిలితే ఫలితం బెడిసి కొట్టక మానదు. ఆ తర్వాత లెంపలేసుకున్నా, చెప్పుతో కొట్టుకున్నా లాభమేంటి? ఈ రోజుల్లో సినిమాను ఎంత గొప్పగా తీస్తారో.. అంతకన్నా గొప్పగా మార్కెట్ చేసుకోవటం తెలిసి ఉండాలి తప్ప, కన్నీళ్లు పెట్టుకుంటే లాభం లేదని గుర్తెరగాలి.