02-07-2025 01:03:59 AM
పట్టించుకోని మున్సిపల్ అధికారులు అవస్థల్లో ప్రయాణీకులు
జహీరాబాద్, జూలై 1: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలు, ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతున్నాయి. ప్రజలు ప్రయాణిం చాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జహీరాబాద్ లోని ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తునడంతో ప్రజలు రహదారిపై వెళ్లేందుకు భయపడుతున్నారు. మహేంద్ర కాలనీలో ఝరాసంగం వెళ్లే రోడ్డు నుండి అల్గోల్ రోడ్డు వరకు ఉన్న కాలనీ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పాఠశాలకు వెళ్లి వచ్చే విద్యార్థులు నీటి గుంతలు నుండే నడవవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినిపించుకోవడం లేదని మహేంద్ర కాలనీవాసులు వాపోతున్నారు. తమ వద్ద ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని ఆరోపిస్తున్నారు. చినుకుపడితే రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలతో రోగాలపాలవుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. పట్ట ణంలోని బస్టాండ్ వద్ద నుండి వెళ్లే రోడ్డు పూర్తిగా నీరు పాడడంతో ప్రజలు వెళ్లడానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడి డ్రైనేజీలు ఎత్తుగా ఉండడం, రోడ్డు కిందికి ఉండడం వల్ల పడిన వర్షపునీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా రోడ్డుపైన ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.