13-12-2024 01:39:18 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని కోరుతూ జనవరి 27న హైదరాబాద్ నగరంలో ‘వెయ్యి గొంతులు లక్ష డప్పులతో దండోరా ప్రదర్శన’ నిర్వహిస్తామని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణను అడ్డుకునే వారికి చావుడప్పు మోగించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలలో భాగంగా 9 మంది కళాకారులను గుర్తించి ఒక్కొక్కరికి కోటి రూపాయల బహుమతి, 300 గజాల స్థలం ఇస్తున్నట్లు ప్రకటించిన 9 మందిలో మాల సామాజికవర్గానికి చెందిన వారే ఐదుగురు ఉన్నారని..
దీంతో మాదిగ కళాకారుల పట్ల ప్రభుత్వ వివక్షత మరోసారి బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మా తల్లి చాకలి ఐలమ్మ మాత్రమే..
గతంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తనలాగే ఉందని ఎమ్మెల్సీ కవితే ఒప్పుకున్నారని.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మరొక తల్లిని తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన రెండు తెలంగాణ తల్లి విగ్రహాలను తెలంగాణ తల్లులుగా మేం అంగీకరించడం లేదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ మాత్రమే అని.. అణగారిన వర్గాల తల్లుల జీవన విధానానికి ప్రతిరూపంగా నిలిచిన ఐలమ్మ విగ్రహాన్ని తామే స్థాపించుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో బహుజన యుద్ద నౌక ఏపూరి సోమన్న, ఎంఆర్‌పీఎస్ కళామండలి జాతీయ అధ్యక్షుడు ఎన్‌వై అశోక్ మాదిగ, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, కళాకారులు రాంనర్సయ్య, శరత్ చమార్, రామంచ భరత్, అనిల్, గజ్జల అశోక్, డప్పు రమేష్, డప్పు రామస్వామి, మహాజన సురేశ్ తదితరులు పాల్గొన్నారు.