09-10-2025 12:28:36 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రచారాన్ని నిర్వహిం చాలని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. నియమావళిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చిచెప్పారు.
సమావేశంలో హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సాయిరాం పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నియమావళి అమలుకు పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని జాయింట్ సీపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.