calender_icon.png 30 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే చెప్పండి

30-08-2025 12:40:46 AM

నేటి వరకు ఫిర్యాదుల స్వీకరణ

 రంగారెడ్డి,ఆగస్టు 29 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై  అధికారులు చక చక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై  ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దానిలో భాగంగా శుక్రవారం  రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో  జిల్లాలోని వివిధ పార్టీ నాయకులతో  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే ఈ నెల 30వ తేదీ వరకు ఫిర్యాదులు చేయొచ్చని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  2025 జూలై 1న అందుబాటులోకి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా గ్రామ పంచాయితీలు, వార్డుల వారీగా జాబితా సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఓటర్ జాబితాలో  ఏమైనా లోపాలు లేదా మార్పులు సూచించాలనుకుంటే ఈ నెల 30 వరకు నిరభ్యంతరంగా రాతపూర్వకంగా తమకు సమర్పించవచ్చనన్నారు.  నేడు మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో కూడా అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని,ఆ అభ్యంతరాలను ఆగస్టు 31న జిల్లా పంచాయితీ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని,సెప్టెంబర్ 2న గ్రామ పంచాయితీల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని అన్నారు.

ఇక రాజకీయ పార్టీలు ప్రస్తావించిన సమస్యలపై స్పందిస్తూ కొన్ని తాండాలలో పోలింగ్ బూత్లు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కొత్తూరు తదితర ప్రాంతాల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు దగ్గరగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.   డీపీఓ సురేష్ మోహన్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సత్తు వెంకట రమణారెడ్డి, నిట్టు జగదీశ్వర్, బీజేపీ అధ్యక్షులు రాంభూపాల్ గౌడ్, ఎన్.మల్లారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, సీపీఐ నాయకులు పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, టీడీపీ నాయకులు జె. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.