calender_icon.png 2 November, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలా.. బహుళ అంతస్తులా!

01-11-2025 08:18:05 PM

* ​జన చైతన్య లేఔట్‌లో అక్రమ దందా

* ​భారీ సెల్లార్లతో ఆకాశ హర్మ్యాలు

* ​పార్కు స్థలాలూ కబ్జా

* ​చర్యలు తప్పవు: కమిషనర్ ప్రదీప్ కుమార్

​మణికొండ (విజయక్రాంతి): ​అది మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జన చైతన్య లేఔట్. కానీ ఇక్కడ చైతన్యం చట్టవిరుద్ధంగా పక్కదారి పట్టింది. ఏకంగా సహజ నీటి ప్రవాహమైన నాలా గర్భాన్నే కబ్జా చేసి, దానిపైనే భారీ సెల్లార్లతో అక్రమ నిర్మాణాలకు కొందరు తెగబడ్డారు. నిబంధనలకు పాతర వేసి, మబ్బులను తాకేలా భారీ బహుళ అంతస్తుల భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాల దందాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మున్సిపల్ యంత్రాంగం కదిలింది.

​ఈ వ్యవహారంపై కమిషనర్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా స్పందించారు. "నాలాపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు. "ఇప్పటికే జారీ అయిన నిర్మాణ అనుమతులను సైతం పునః పరిశీలిస్తాం. ఇరిగేషన్, నాలా, రెవెన్యూ శాఖల నుంచి పొందిన నిరభ్యంతర పత్రాలను (ఎన్ఓసి) క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఆ అనుమతుల్లో ఏమాత్రం అక్రమం తేలినా, నాలా పరిధిలో నిర్మాణం ఉన్నట్లు రుజువైనా.. తక్షణం పర్మిషన్లు రద్దు చేస్తాం" అని కమిషనర్ హెచ్చరించారు.

​పార్క్ స్థలాలపైనా కన్ను

​కేవలం నాలాలే కాదు, జన చైతన్య కాలనీలోని పార్కు స్థలాలు సైతం కబ్జాకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. "త్వరలోనే కాలనీ వాసుల కోసం ఆహ్లాదకరమైన పార్కు స్థలాన్ని గుర్తించి, దాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతాం" అని ఆయన హామీ ఇచ్చారు. ఒక ప్రణాళికాబద్ధమైన లేఔట్‌లో ఇంత భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.