08-11-2025 12:00:00 AM
ఫిర్యాదులు అందాయని బెదిరించి పనుల నిలిపివేత
ఆపై బేరం కుదుర్చుకుని అక్రమార్కుల వద్ద లక్షల్లో వసూళ్లు
స్థలవిస్తీర్ణం బట్టి స్లాబ్ కు లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు
టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నా.. పత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్న అవేవీ తమకు పట్టనట్లుగా సైలెంట్గా తమ పనిని ఎంచక్కా కానిచ్చేస్తున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ.. డబ్బు మూటలు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అడ్డుకునేవారు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇది జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ జోనల్ పరిధి చందానగర్ సర్కిల్-21లో జరుగుతున్న తంతు.
శేరిలింగంపల్లి, నవంబర్ 7 (విజయక్రాంతి): చందానగర్ సర్కిల్-21లో యథేచ్ఛగా అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరితో జీహెచ్‌ఎంసీ కిందిస్థాయి అధికారులకు వరంగా మారింది. చందానగర్ సర్కిల్ -21 లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ స్థాయి అధికారులు, కిందిస్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
చైన్ మెండ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ అక్రమార్కులతో అంటకాగుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నా అవేమీ తమకు పట్టని విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో అక్రమ సెల్లార్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హఫీజ్ పేట్, మదాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్లలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతు న్నాయి.
ఆదిలోనే అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, అక్రమార్కులతో ములాఖాత్ అయ్యి అందిన కాడికిదోచుకుని దాచుకుంటున్నారు. వీరి ఆగడాలకు కట్టడి చేయాల్సిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం(ఎస్టీఎఫ్), న్యాక్ బృందాలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. సెల్లార్లు, అదనపు అంతస్తులు నిర్మిస్తున్న అక్రమార్కుల నుంచి రూ.లక్షల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది.
అనుమతులు ఉన్నాయా?
పర్మిషన్లు ఉన్నాయా..? లేదా..? అసలు అనుమతి కోసం టీఎస్ బి పాస్ లో అప్లై చేసుకున్నారా..? అనే ప్రశ్నలకే తావులేకుండా అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా అంతస్థుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు.అటువైపు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు,సిబ్బంది వెళ్లినా చూసీ చూడనట్టుగా వ్యవహరించడం, అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండడంతో ఈ తరహా నిర్మాణాలకు జోరందుకున్నాయి. చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని పలు డివిజన్ లలో అనేక నిర్మాణాలు సాగుతున్నా.. అనుమతులు మాత్రం కొన్నింటికే ఉన్నాయని తెలుస్తోంది.
అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు వాటి విషయంలో నోటీసులతో సరిపెట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి పడుతుందని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా స్వలాభం కోసం అక్రమార్కులతో కలిసి ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారని సర్కిల్ ప్రజలు మండిపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలకు అడ్డేది
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, గురుకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా లతో పాటు పలు కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వివాదాస్పద భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుడని కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి యదేచ్చగా భారీ భవన నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తుల నుంచి 7 ఫ్లోర్ ల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు.
స్థలం తక్కువున్నా, ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే, సెల్లార్లు తవ్వేసి 6-7 అంతస్థుల మేడలు కట్టేస్తున్నారు. ఇంకొందరు అయితే 60 నుంచి 200 గజాల లోపు స్థలాల్లోనే 5 అంతస్తులు కట్టేస్తున్నారు. వీటివల్ల భవిష్యత్ తరాలకు ఇబ్బందులతో పాటు పలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు తూచ్
ప్రధానంగా గోకుల్ ప్లాట్స్, గురుకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా లాంటి వివాదాస్పద భూముల్లో కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి యదేచ్చగా భారీ భవన నిర్మాణాలు సాగిస్తున్నారు.ఇక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి.కొందరు బిల్డర్లు, నిర్మాణదారులు ఏకంగా 6 -7అంతస్తులు కట్టేసి వాటిపై మరో పెంట్ హౌస్ కట్టేసుకున్నారు.వీటిలో ఎక్కడా కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు.అయినా ఈ విషయాలు అన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మిన్నకుండి చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే వారించినా మార్పు లేదు..
జీహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వారిని ఆయన క్యాంప్ కార్యాలయంలో పిలిచి తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సంభందిత శాఖ అధికారులను ఆదేశించారు.ఐన వారి ప్రవర్తనలో మార్పు లేదని తోటి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు.
వందల కోట్ల ఆదాయానికి గండి
శేరిలింగంపల్లి జోనల్ వ్యాప్తంగా ఆయా సర్కిళ్లలో సాగుతున్న నిర్మాణాలతో జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం చేకూరాలి, కానీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మాత్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సంస్థ ఆదాయానికి అధికారులే గండి కొడుతుంటే జీహెచ్‌ఎంసీ ఎప్పటికి కొలుకుంటుందన్నది ప్రశ్న అనే చెప్పాలి. అనుమతులు లేకుండా,అంతకు మించి సాగుతున్న నిర్మాణాలపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సాధిస్తారో లేదో వేచి చూడాలి.